
'సీమాంధ్రుల ఆందోళనలను కాంగ్రెస్సే నివృత్తి చేయాలి'
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ స్పష్టం చేశారు. బుధవారం కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను నారాయణ కలిశారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న ఆటలో భాగంగానే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నడుచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కానీ సీఎం కిరణ్ మాత్రం సమైక్యాంధ్ర అంటున్నారని తాను షిండేను అడిగాను. ఆ ప్రశ్నకు షిండే ఏమి మాట్లాడకుండా నవ్వి ఊరుకున్నారని తెలిపారు. దీన్ని బట్టి కిరణ్ కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న ఆటలో భాగంగానే ఆడుతున్నారని అర్థమవుతుందన్నారు. తెలంగాణకు అనుకూలంగా సీపీఐ పార్టీ నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని ఈ సందర్భంగా నారాయణ గుర్తు చేశారు.