బావమరిదికి షాక్ ఇచ్చిన తమ్మయ్య
ఆచంట: 'బావ బావ పన్నీరు బావను పట్టుకుని తన్నారు...' అని తెలుగులో ఒక సరదా పాట ఉంది. ఆత్మీయులే ప్రత్యర్థులుగా మారుతున్న ఆధునిక రాజకీయ ఎన్నికల సమరాంగణంలో ఈ పాట పాడుకునే సందర్భాలు ఆగుపిస్తున్నాయి. ఇందుకు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గమే ఉదాహరణ.
ఇక్కడి నుంచి టీడీపీ తరపున పోటీ చేయాలని పెనుగొండ డిగ్రీ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ గుబ్బల తమ్మయ్య భావించారు. పార్టీ తనకే టిక్కెట్ ఇస్తుందన్న దీమాతో ముందే ప్రచారం కూడా మొదలుపెట్టారు. తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో తమ్మయ్య బావమరిది పితాని సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వలసవచ్చారు. ముందొచ్చిన చెవులు కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి చందంగా తమ్మయ్యను కాదని పితానికి టిక్కెట్ ఇచ్చారు సైకిల్ పార్టీ అధినేత.
సొంత బావమరిదే తన సీటు ఎసరు పెట్టడంతో తమ్మయ్య మనస్తాపానికి గురయ్యారు. తన మద్దతుదారుల సలహాతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనను వైఎస్సార్ సీపీ నేతలు వంకా రవీంద్ర, ప్రసాదరాజు, చీర్ల రాధయ్య సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బావమరిది ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి తమ్మయ్య 'ఫ్యాన్' గాలిని ఆశ్రయించారు. మరోవైపు టీడీపీని వదిలిపెట్టి బావమరిదికి తిరిగి షాక్ ఇచ్చారు.