చంద్రబాబుకు సొంత జిల్లాలో షాక్ | he shock of their own home district | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు సొంత జిల్లాలో షాక్

Published Wed, Apr 9 2014 2:51 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM

చంద్రబాబుకు సొంత జిల్లాలో షాక్ - Sakshi

చంద్రబాబుకు సొంత జిల్లాలో షాక్

 వైఎస్సార్ సీపీలో చేరిన చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జంగాలపల్లి
 
అదే బాటలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు


పార్టీలోకి ఆహ్వానించిన జగన్‌మోహన్‌రెడ్డి
విశ్వసనీయత కలిగిన జగన్‌తోనే వైఎస్ ఆశయాలు సాకారమవుతాయన్న నేతలు

 
 హెదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆయన సొంత జిల్లాలోనే రాజకీయ షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. అలాగే తెలంగాణలోని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పద్నాలుగేళ్ల పాటు సేవలందించిన వనమా వెంకటేశ్వరరావు కూడా పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. జంగాలపల్లి, వనమా ఇద్దరూ మంగళవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో విడివిడిగా కలుసుకున్నారు. తమ అనుచరులతో వచ్చిన వీరిని జగన్ సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జంగాలపల్లి శ్రీనివాసులు చేరిక సందర్భంగా రాజంపేట లోక్‌సభా నియోజకవర్గం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పి.మిథున్‌రెడ్డి కూడా ఉన్నారు.

 బాబుకు విశ్వసనీయత లేదు: జంగాలపల్లి
 
చంద్రబాబు ఏ మాత్రం విశ్వసనీయత లేని నాయకుడని, అసలు ఆయనకు మనుషులంటే అభిమానం లేదని, ఎవరినీ ఆదరించే రకం కాదని జంగాలపల్లి శ్రీనివాసులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వసనీయతకు వారసత్వంగా ఉన్న నాయకుడు జగన్ ఒక్కరేనని, అందుకే ఆయన నాయకత్వంలో పని చేయాలని టీడీపీ అధ్యక్ష పదవిని వదులుకుని వైఎస్సార్ సీపీలో చేరానని మీడియాకు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలను పార్టీ నేతలు, కార్యకర్తలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, ఆయన చేసిన తప్పులను, అన్యాయాలను తప్పకుండా ప్రజలకు చాటి చెబుతామని అన్నారు. చంద్రబాబులో విశ్వసనీయత లేదని, జగన్‌లో విశ్వసనీయత ఉందని, ఇదొక్కటే తాను వైఎస్సార్ సీపీలో చేరడానికి కారణమని చెప్పారు. ‘ఇకపై జగన్ ఏం చెబితే జిల్లాలో అది చేస్తాం. ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని విధాలా గట్టిగా కృషి చేస్తాం’ అని శ్రీనివాసులు స్పష్టం చేశారు.
 
 వైఎస్ పథకాల వల్ల బడుగులకు మేలు: వనమా
 
 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో మేలు జరిగిందని, ఆయన వల్ల లబ్ధి పొందిన వారు తెలంగాణలో కూడా లక్షల సంఖ్యలో ఉన్నారని వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆశయాల అమలుకు కృషి చేసే నాయకుడు జగన్ మాత్రమేనన్న నమ్మకంతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరానన్నారు. పద్నాలుగేళ్లు నిబద్ధతతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన తనను కాంగ్రెస్ పార్టీ చివరి దశలో మోసం చేసిందన్నారు.

కాంగ్రెస్, సీపీఐ రెండూ నిబద్ధత లేని పార్టీలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం లోక్‌సభా స్థానం పార్టీ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వనమా పార్టీలో చేరినందుకు తమకు ఆనందంగా ఉందని, ఆయన చేరిక తెలంగాణలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తుందనడానికి సంకేతమని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మిగిలిపోయిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement