రమ్మన్నా... రానన్న పైలట్ | Helicopter pilot rejects Ponnala Laxmaiah Instructions | Sakshi
Sakshi News home page

రమ్మన్నా... రానన్న పైలట్

Published Wed, Apr 23 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM

Helicopter pilot rejects Ponnala Laxmaiah Instructions

హెలికాప్టర్ పైలట్‌తో పొన్నాల గొడవ  

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు హెలికాప్టర్ కష్టాలొచ్చి పడ్డాయి. తెలంగాణ అంతటా తిరిగేందుకు హెలికాప్టర్ అద్దెకు తీసుకుంటే పార్టీ అభ్యర్థులెవరూ ప్రచారానికి పిలవకపోవడం కనీసం తన సొంత జిల్లాలో తిరిగేందుకైనా ఉపయోగించుకుందావునుకున్నా దానికీ తిప్పలే  ఎదురవుతున్నాయి. వుంగళవారం ఓచోటకు రావడానికి పెలైట్ నిరాకరించడంతో పొన్నాలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పైలట్‌ను తిట్టుకుంటూ హెలికాప్టర్ దిగి కారులో వెళ్లిపోయారు. దీంతో నిర్ఘాంతపోయిన  పైలట్ పైఅధికారికి ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.

సినీనటి విజయశాంతి, పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండరె డ్డిలతో కలిసి మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు పొన్నాల తన సొంత నియోజకవర్గంలోని మద్దూరుకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం హనుమకొండ సమీపంలోని మడికొండకు వెళ్లేందుకు పొన్నాల హెలికాప్టర్ వద్దకు వచ్చారు. ఈనెల 25న రాహుల్‌గాంధీ మడికొండకు  వస్తున్నందున బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు అక్కడికి వెళ్లాలని పైలట్‌ను ఆదేశించారు. దీనికి పైలట్ నిరాకరించాడు. షెడ్యూల్ ప్రకారం బేగంపేటకు మాత్రమే తీసుకెళతానని, మడికొండకు వెళ్లేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి లేదన్నాడు. దీంతో అసహనానికి లోనైన పొన్నాల వెంటనే మీ పై అధికారికి ఫోన్ కలపాలంటూ వుండిపడ్డారు. దానికీ పైలట్ నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన పొన్నాల  పైలట్‌ను దుర్భాషలాడి  హెలికాప్టర్ దిగి కారులో మడికొండ వెళ్లారు.

దీంతో విజయశాంతి, కోదండరెడ్డిలను మాత్రమే తీసుకుని పైలట్ హైదరాబాద్‌కు చేరి పొన్నాలపై ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. కాగా, సాయంత్రం పొన్నాల హైదరాబాద్‌కు రోడ్డు మార్గానే బయలుదేరారు. నామినేషన్లు ముగిసిన నాటి నుంచి పోలింగ్ జరిగే వరకు తెలంగాణ అంతటా ప్రచారం చేయడానికి పొన్నాల హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నారు. గంటకు లక్షకుపైగా వెచ్చిస్తున్న హెలికాప్టర్ అనుకున్న రీతిలో ఉపయోగపడడం లేదనే భావనతో ఆయన ఉన్నారు. దీనికితోడు కాంగ్రెస్ అభ్యర్థులెవరూ ప్రచారానికి రావాలని తనను పిలవకపోవడం కూడా ఆయనకు ఇబ్బందిగా మారింది. వృథా చేయకుండా హెలికాప్టర్‌ను హైదరాబాద్-వరంగల్ షటిల్ సర్వీస్‌లా వాడుకుందామని భావిస్తే అదీ కుదరడం లేదని పొన్నాల బాధ.
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement