నామినేషన్ల జోరు | Hugely Nominations | Sakshi
Sakshi News home page

నామినేషన్ల జోరు

Published Thu, Apr 17 2014 3:13 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM

Hugely Nominations

సాక్షి, కడప : జిల్లాలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు ఊపందుకున్నాయి. మందకొడిగా ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ బుధవారం నాటికి జోరందుకుంది. బుధవారం ఒక్కరోజే అసెంబ్లీ స్థానాలకు 29, కడప పార్లమెంటుకు 3 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. నామినేషన్లు వేసేందుకు ఇక రెండు రోజులు అంటే 17, 19 తేదీలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
 
 వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో గురువారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. కడప లోక్‌సభ స్థానానికి బుధవారం మధ్యాహ్నం వైఎస్ అవినాష్‌రెడ్డి నామినేషన్ వేశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఆయన వెంట వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ ప్రకాశ్‌రెడ్డి, వైఎస్ ఆనందరెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఉన్నారు.
 
 కలెక్టర్ కోన శశిధర్ వైఎస్ అవినాష్‌రెడ్డిచే ప్రమాణం చేయించారు. ఈనెల 19వ తేదీన మళ్లీ అట్టహాసంగా వైఎస్ అవినాష్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. ఇప్పటికే ఈనెల 15వ తేదీన వైఎస్ అవినాష్‌రెడ్డి తరుపున ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలుచేశారు. కడప లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థి శ్రీనివాసులురెడ్డి తరుపున గోవర్దన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
 
 అట్టహాసంగా అసెంబ్లీ నామినేషన్లు
 బద్వేలులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జయరాములు మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి నేతృత్వంలో  మార్కెట్‌యార్డు నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా జయరాములు నామినేషన్ దాఖలు చేశారు.
 
 రాజంపేటలో మన్నూరు పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు అభ్యర్థి మిథున్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు, పోలా శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.
 
 రైల్వేకోడూరులో వైఎస్ అతిథి గృహంనుంచి టోల్‌గేట్ మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలతో కలిపి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొరముట్ల  శ్రీనివాసులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట లోక్‌సభ అభ్యర్థి మిథున్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, సుకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 నిరాడంబరంగా...
 
 ప్రొద్దుటూరులో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ముక్తియార్, ఈవీ సుధాకర్‌రెడ్డి, జింకా విజయలక్ష్మి, నారాయణరెడ్డిలతో కలిసి మధ్యాహ్న సమయంలో నామినేషన్ దాఖలు చేశారు.
 
  మైదుకూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎస్.రఘురామిరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డితో కలిసి నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు.
 
 రాయచోటిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, గడికోట మోహన్‌రెడ్డితోపాటు నేతలు బషీర్‌ఖాన్,సలావుద్దీన్‌తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
 
 జమ్మలమడుగులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి తరుపున ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తనయుడు సుబ్బరామిరెడ్డి (భూపేష్) నామినేషన్ దాఖలు చేశారు.
 
 టీడీపీ అభ్యర్థులుగా..
 తెలుగుదేశం పార్టీ తరుపున రాయచోటిలో రమేష్‌రెడ్డి, మైదుకూరులో పుట్టా సుధాకర్‌యాదవ్, జమ్మలమడుగులో పి.రామసుబ్బారెడ్డి నిరాడంబరంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు కడప లోక్‌సభకు ఐదు, అసెంబ్లీ స్థానాలకు 37 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా 18వ తేదీ గుడ్‌ఫ్రైడే కారణంగా సెలవు ఉండడంతో నామినేషన్ల దాఖలుకు 17, 19 తేదీలు రెండురోజులే గడువు ఉండడంతో ఆ రోజుల్లో అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement