..ఆ ‘భాగ్య’మేది
* మహానేత మరణంతో కొండెక్కిన అభివృద్ధి
* వైఎస్ ఆశయాలకు తూట్లు పొడిచిన ప్రభుత్వాలు
* మహా నగరాభివృద్ధి తుంగలోకి..
పెద్దిశెట్టి వెంకటనారాయణ, సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిపెట్టేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషి అంతాఇంతా కాదు. మౌలిక వసతుల కల్పనకు ఆయన ఎంతగానో శ్రమించారు. గ్రేటర్ సిటీ భవిష్యత్తుపై ముందుచూపుతో వ్యవహరించి ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు రూపమిచ్చారు. శివారు ప్రాంతాలను నగరానికి అనుసంధానిస్తూ నాలుగు జిల్లాల పరిధిలో 849 గ్రామాలతో కలిపి మొత్తం 5965 చ.కి.మీ. విస్తీర్ణంలో మాస్టర్‌ప్లాన్ నిర్దేశించడం వైఎస్ విజన్‌కు అద్దం పడుతోంది. వచ్చే వందేళ్లలో నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ అభివృద్ధి పనులకు రూపకల్పన చేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్, రవాణా అవసరాలను మెరుగుపర్చేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా నగరం వెలుపల 158 కి.మీ. పరిధిలో 8 లేన్ల ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సిటీలో ఇన్నర్ రింగ్‌రోడ్లు, ఫ్లై ఓవర్లు వంటివాటిని అభివృద్ధి చేసి కొత్త రవాణా మార్గాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
నగరంలో ఇంటిలిజెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టం (ఐటీఎస్) అమలు చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వైఎస్ కలలుగన్నారు. అయితే మహానేత అకాల మరణంతో ఆయన తలపెట్టిన పలు పథకాలకు బ్రేక్ పడింది. ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టకపోవడంతో అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అవే కనుక పూర్తయి ఉంటే.. భాగ్యనగరం భూతల స్వర్గంగా విరాజిల్లేది. అభివృద్ధి చెందిన ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం దక్కేది. అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ ఆదర్శనగరంగా కీర్తి గడించేంది. కానీ మహానేత మరణంతో భాగ్యనగరానికి అభివృద్ధి ఫలాలు అందకుండా పోయాయి.
రూ. 7,000 కోట్లు: ఔటర్ రింగ్‌రోడ్డుకు కేటాయించిన మొత్తం
రూ. 2000 కోట్లు: పాతబస్తీ అభివృద్ధికి ప్రకటించిన ప్యాకేజీ
రూ. 439కోట్లు: పీవీ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి మంజూరైన నిధులు
రూ. 370కోట్లు: హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు కేటాయించిన మొత్తం
రూ. 200 కోట్లు: ఉస్మానియాలో ఏడంతుస్తుల అధునాతన భవన నిర్మాణానికి కేటాయింపులు
రూ. 27కోట్లు: నవజాత శిశువుల కోసం నిలోఫర్‌లో 150 పడకల రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ భవ నానికి కేటాయించిన సొమ్ము
రూ. 25కోట్లు: నగరంలోని విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం మంజూరు చేసిన మొత్తం
రూ. 20కోట్లు: 36 వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రుణమాఫీ కోసం ఖర్చుచేసింది
1.53లక్షలు: ఐటీ రంగంలో లభించిన ఉద్యోగాల సంఖ్య
78,000: పేదల కోసం మంజూరు చేయించిన ఇళ్లు 24శాతం నగరంలోని గ్రీన్‌స్పేస్
అసంపూర్తిగా ఔటర్ రింగ్ రోడ్డు
రూ.ఏడువేల కోట్ల భారీ వ్యయంతో 158 కి.మీ మేర నగరం చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణాన్ని వైఎస్ హయాంలో తలపెట్టారు. నగర విస్తరణ, పెరుగుతున్న ట్రాఫిక్ చిక్కుల నేపథ్యంలో 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో దీనికి రూపకల్పన చేశారు. 2012నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా వైఎస్ తర్వాత వచ్చిన పాలకులు దీనిని పూర్తిచేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. ప్రస్తుతం శామీర్‌పేట నుంచి పెద్ద అంబర్‌పేట వరకు 35 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. వైఎస్ హయాంలో పరుగులు పెట్టిన ఈ ప్రాజెక్టు పనులపై ఆ తర్వాత ప్రభుత్వం కనీసం సమీక్షలు కూడా నిర్వహించకపోవడంతో అసలు ఔటర్ పూర్తవుతుందా ? అన్న అనుమానం కలుగుతోంది.
పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై నిర్లక్ష్యం
శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా రూ.600కోట్ల వ్యయంతో పీవీ నర్సింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే ఏర్పాటు చేశారు. నగరం నుంచి కేవలం 25 నిమిషాల వ్యవధిలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా ఈ మార్గాన్ని రూపొందించారు. మొత్తం 11.6 కి.మీ. పొడవు ఉండే ఈ వంతెన నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చినా 2 ర్యాంపులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. ఫలితంగా పీవీ ఎక్స్‌ప్రెస్ వే పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతోంది. నిధులున్నా దీన్ని పూర్తిచేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండడం పక్షపాత ధోరణికి అద్దం పడుతోంది.
సాగుతున్న ‘సాగర్’ ప్రక్షాళన
నగరంలోని హుస్సేన్‌సాగర్ జలాశయాన్ని ప్రధాన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రూ.370కోట్ల వ్యయంతో ప్రక్షాళన ప్రాజెక్టుకు వైఎస్ హయాంలో శ్రీకారం చుట్టారు. నిర్ణీత గడువు మేరకు 2012నాటికి ప్రాజెక్టు పనులన్నీ పూర్తవ్వాలి. కానీ ఈ ప్రాజెక్టుపై రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టకపోవడంతో గడువు ముగిసి రెండేళ్లవుతున్నా సగం పనులు కూడా పూర్తవలేదు. పాటిగడ్డ వద్ద 30ఎంఎల్‌డీ ఎస్టీపీల నిర్మాణం పూర్తయినా ఇంతవకు దాని పనితీరును పాలకులు పరిశీలించిన పాపాన పోలేదు. ఇప్పటికే రూ.200కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినా ఈ ప్రాజెక్టు పనులు ఎప్పటికి పూర్తవుతాయన్నది జవాబులేని ప్రశ్న.
మొండిగోడల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్
పాతబస్తీలోని కాటేదాన్‌లో రూ.ఏడుకోట్ల వ్యయంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి అప్పట్లో వైఎస్సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సగం నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ కాంప్లెక్స్ జననేత మరణంతో అసంపూర్తిగా మిగిలిపోయింది. దీనిగురించి పట్టించుకునేవారే లేకపోవడంతో రూ.మూడుకోట్ల ప్రజాధనం వృథా అయింది. ఇప్పుడిక్కడ కనిపిస్తున్న మొండిగోడలు నాటి ఆలోచనకు ఆనవాళ్లుగా మిగిలాయి.
విద్యార్థులకు అండగా..
ఉన్నత విద్య అభ్యసించేందుకు పేద విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారికి కొండంత అండగా నిలిచారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టి భరోసా ఇచ్చారు. అప్పటికే కట్టిన ఫీజులను వెనక్కి తీసుకునే అవకాశం కల్పించారు. ఒక్క నగరంలోనే 51731 మంది విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేశారు. ఇందుకోసం రూ.25 కోట్లు కేటాయించారు. మరో 5594 మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించింది. దీనికోసం రూ.4.17 కోట్లు ఖర్చు చేశారు.
ఎస్సీ, ఎస్టీలకు రుణమాఫీ
నగరంలోని సుమారు 36 వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు వైఎస్ పూర్తిగా రుణమాఫీ ప్రకటించారు. ఇందుకోసం రూ.20కోట్లు ఖర్చుచేశారు. చంద్రబాబు హయాంలో పాతికవేలమంది కూడా లేని పింఛన్‌దారుల సంఖ్యను వైఎస్ లక్షాపన్నెండు వేలకు పెంచారు. అప్పటి వరకు రూ.75 ఉన్న పింఛన్‌ను రూ.200 చేశారు. ‘బాబు’ హయాంలో వికలాంగుల పింఛన్ రూ.75 ఉండగా.. వైఎస్సార్ దానిని రూ.500 చేశారు. బాబు జమానాలో ఉద్యోగులు ఏనాడూ 17శాతానికి మించి అందుకోని మధ్యంతర భృతిని వైఎస్సార్ హయాంలో 22శాతం అందుకున్నారు.
విద్య, వైద్య రంగాల్లో మైనారిటీలు సమున్నత స్థానం సాధించాలన్నదే మా ప్రభుత్వ అభిమతం. అందుకే వారి సంక్షేమం కోసం బడ్జెట్‌ను రూ.4 కోట్ల నుంచి రూ.208 కోట్లకు పెంచాం. 4 శాతం రిజర్వేషన్లు కల్పించాం. స్కాలర్‌షిప్ బడ్జెట్‌ను రూ.127 కోట్లకు పెంచాం.
- మైనారిటీ దినోత్సవాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి
వెల్లువలా పెట్టుబడులు
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పారిశ్రామిక రంగం గణనీయమైన అభివృద్ధి సాధించింది. ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడ్డాయి. చిన్న,లఘు పరిశ్రమల్లో 50.6 శాతం పెట్టుబడులు వచ్చాయి. మౌలిక వసతుల కల్పన, ఉత్పత్తి విభాగాలకు ప్రోత్సాహం లభించింది. సుమారు 1.20లక్షల మందికి ఉపాధి లభించింది. 82వేల మంది నిరుద్యోగులైన విద్యావంతులను ఎంపిక చేసి వివిధ వృత్తుల్లో శిక్షణ ఇవ్వగా 55వేలమందికి ఉపాధి లభించింది. రాజీవ్ ఉద్యోగశ్రీ కింద ప్రైవేటు రంగంలో 22 వేల మందికి ఉపాధి కల్పించగా, రాజీవ్ యువశక్తి పథకం కింద 29 వేల మందికి ఆర్థిక సాయం అందించడంతో వివిధ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఐటీ రంగంలో 1.53 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి.
నిరుపేదలందరికీ తెల్లరేషన్ కార్డులు
వైఎస్ అధికారంలోకి రాగానే అర్హులైన పేదలందరికీ తెల్లరేషన్ కార్డులు అందించారు. ఇందుకోసం గ్రామాల్లో గతంలో రూ.20వేలు ఉన్న ఆదాయ పరిమితిని రూ.60వేలకు, పట్టణాల్లో రూ.25వేల నుంచి రూ.75 వేలకు పెంచారు. దీంతో హైదరాబాద్‌లో రేషన్‌కార్డుల సంఖ్య 5.28 లక్షలకు, రంగారెడ్డి జిల్లాలో 8.81 లక్షలకు చేరింది. చౌకబియ్యం ధరను రెండు రూపాయలు చేశారు. తెల్లరేషన్‌కార్డుదారులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేశారు.