
అయ్యయ్యో..
- పాపం.. డిపాజిట్లూ దక్కలేదు!
- హనుమంతు.. ధరావత్తు గల్లంతు
- అదే వరుసలో ‘సర్వే’..
- ఇంకా జేపీ, జయసుధ, కూన, ప్రొ.నాగేశ్వర్‌లకు కూడా..
- ముద్దం, శ్రీధర్‌లకూ భంగపాటే..
సాక్షి, సిటీబ్యూరో: గెలుపు ఖాయమనుకున్నారు. ఏయే ప్రాంతాల్లో, ఏయే వర్గాల నుంచి ఎన్నెన్ని ఓట్లు పడతాయో అంచనాలు వేశారు. మెజారిటీ ఎంతన్నది లెక్కలు కట్టారు. కానీ, ఓటర్ల ‘లెక్క’ వేరే ఉంది. గుక్కతిప్పుకోలేని విధంగా తీర్పునిచ్చారు. బిత్తరపోవడం అభ్యర్థుల వంతైంది. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు డిపాజిట్ కోల్పోయారు. గెలుపు ధీమాతో బరిలో దిగిన పలువురికి గెలుపు సంగతలా ఉంచితే, కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. అలాంటి వారిలో ఏకంగా సీఎం స్థానం కోసం, కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం ఆశపడిన వారూ ఉన్నారు. రెండుసార్లు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, గత మంత్రివర్గంలో మంత్రులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలుగా చేసిన వారూ.. ఈ జాబితాలో ఉన్నారు.
సీఎం అవుతారన్నారు!
పోలైన మొత్తం ఓట్లలో ఆరో వంతు ఓట్ల కన్నా తక్కువ వస్తే డిపాజిట్ కోల్పోయినట్టు. అలా డిపాజిట్లు కోల్పోయిన గ్రేటర్ ప్రముఖుల్లో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) ముందు వరుసలో ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థిగా వీహెచ్ రేసులో ఉంటారని ప్రచారం జరిగింది. పైగా ఆయన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై పోటీకి దిగడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో రాజ్యసభ పదవీకాలం ఉన్నప్పటికీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఆశతో వీహెచ్ అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. ఆ నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లు 1,46,682 కాగా డిపాజిట్ దక్కాలంటే 24,447 ఓట్లు పొందాలి. వీహెచ్‌కు 16,975 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయన డిపాజిట్ గల్లంతైంది.
అయ్యో.. పాపం!
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పోలైన ఓట్లు 2,82,823. వీటిలో కనీసం 47,137 ఓట్లు వస్తే డిపాజిట్ దక్కినట్టు. తాజా మాజీ ఎమ్మెల్యే అయిన బిక్షపతి యాదవ్ (కాంగ్రెస్)కు 43,196 ఓట్లు మాత్రమే వచ్చాయి
సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి మరోమారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ ప్రముఖురాలు జయసుధకు సైతం డిపాజిట్ దక్కలేదు. అక్కడ 1,36,549 ఓట్లు పోలవగా, జయసుధకు 14,090 ఓట్లు లభించాయి. ఇవి ఆరో వంతు కూడా లేకపోవడంతో ఆమె డిపాజిట్ కోల్పోయారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన తాజా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ (కాంగ్రెస్)కు 40,199 ఓట్లు మాత్రమే లభించాయి. ఇక్కడ డిపాజిట్ దక్కాలంటే 48,711 ఓట్లు రావాల్సి ఉంది
జీహెచ్‌ఎంసీలో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థానానికి ఎదగాలని ఆశపడ్డప్పటికీ, డిపాజిట్లు కూడా దక్కించుకోని వారిలో ముద్దం నరసింహయాదవ్, నందికంటి శ్రీధర్ ఉన్నారు.
ఓల్డ్‌బోయిన్‌పల్లి కార్పొరేటర్ నర్సింహయాదవ్ కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 23,321 ఓట్లు మాత్రమే రావడంతో ఆయనకు డిపాజిట్ దక్కలేదు. ఆ నియోజకవర్గంలో పోలైన 2,36,367 ఓట్లలో డిపాజిట్ రావాలంటే 39,394 ఓట్లు రావాలి
జీహెచ్‌ఎంసీ కో-ఆప్షన్ సభ్యుడైన నందికంటి శ్రీధర్ మల్కాజిగిరి కా్రంగెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. అక్కడ 2,31,103 ఓట్లు పోలవగా, ఆయనకు 37,201 ఓట్లు మాత్రమే వచ్చాయి. అక్కడ డిపాజిట్ దక్కాలంటే 38,517 ఓట్లు రావాల్సి ఉంది.
లోక్‌సభ బరిలో డిపాజిట్ దక్కని ప్రముఖులు
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం ఈసారి ఎన్నికల్లో హాట్ స్పాట్‌గా మారింది. పలువురు హేమాహేమీలు ఇక్కడి నుంచి బరిలో దిగారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 16,05,550 ఓట్లు పోలవగా, డిపాజిట్ దక్కాలంటే అభ్యర్థి 2,67,591 ఓట్లు పొందాలి. ఈ మొత్తం ఓట్లు రాక డిపాజిట్లు కోల్పోయిన ప్రముఖుల్లో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్‌నారాాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్ తదితరులున్నారు.
సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి భీమ్‌సేన్ (టీఆర్‌ఎస్)కు సైతం డిపాజిట్ గల్లంతైంది. అక్కడ మొత్తం 9,86,590 ఓట్లు పోలవగా, ఆయనకు 1,43, 847 ఓట్లు మాత్రమే లభించాయి.