తిరువళ్లూరు, న్యూస్‌లైన్ : తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా 195 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్టు తిరువళ్లూరు కలెక్టర్ వీరరాఘవరావు, ఎస్పీ శరవణన్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లాకు వచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలతో పట్టణంతో పాటు మనవాలనగర్ ప్రాంతంలో కవాతు నిర్వహించారు.
ర్యాలీ ముగింపు సందర్భంగా కలెక్టర్ వీరరాఘవరావు మీడియాతో మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 195 సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలను గుర్తించి, వాటిని క్షుణ్ణంగా పర్యవేక్షించడానికి వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఆంధ్రా నుంచి ఒక కంపెనీ భద్రతా దళాలను రప్పించామని, అవసరమైతే మరిన్ని బలగాలను రప్పిస్తామని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే విధులను నిర్వహిస్తున్న ఎన్నికల స్పెషల్ టీమ్‌తో కలిసి ఆంధ్రా పోలీసులు తనిఖీల్లో పాల్గొంటారని కలెక్టర్ వీరరాఘవరావు వెల్లడించారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినా, ఎన్నికల సమయంలో నగదు, ఇతర వస్తువులు పంపిణీ చేయడానికి ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
195 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు
Published Fri, Mar 21 2014 11:26 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement