బాబు కాలం రైతుకు రాహుకాలం
వ్యవసాయం దండగ అంటూ తొమ్మిదేళ్ల పాలనలో రైతులకు టీడీపీ అధినేత చంద్రబాబు నరకం చూపించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. విపరీతంగా పెరిగిన విద్యుత్ బిల్లులు కట్టలేక అన్నదాతలు అప్పుల పాలయ్యారు. విద్యుత్ లేక, పంటలు పండక, తెచ్చిన పెట్టుబడికి వడ్డీ కట్టలేక అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో విద్యుత్ కష్టాలపై రైతుల అభిప్రాయాలు...
బిల్లుల కోసం పుస్తెలు తాకట్టు పెట్టేవాళ్లం
చంద్రబాబు పాలనలోని తొమ్మిదేళ్లూ నరకం చూశాం. వ్యవసాయం దండగ అంటూ బాబు చెప్పిన రీతిలోనే ఆయన పాలన సాగింది. బిల్లు బకాయిలు చెల్లించలేకపోతే కరెంటు కనెక్షన్లు తొలగించేవారు. దీంతో కళ్లముందే పంట ఎండిపోతూంటే విలవిలలాడిపోయేవాళ్లం. చేసేది లేక పుస్తెలు సైతం తాకట్టు పెట్టి కరెంటు బకాయిలు చెల్లించాల్సి వచ్చేది.
- కలిశెట్టి ఫల్గుణ, అభ్యుదయ రైతు, బిక్కవోలు
కరెంటు కోసం పడిగాపులు
చంద్రబాబు కాలంలో వ్యవసాయానికి విద్యుత్ సక్రమంగా సరాఫరా చేసేవారు కాదు. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక నానా ఇబ్బందులూ పడేవాళ్లం. కరెంటు కోసం రేయింబవళ్లు పడిగాపులు కాసేవాళ్లం.
- సామంతుల నీలంబరరావు, ఏలేశ్వరం
బాబు నిరంకుశత్వం
5 హెచ్‌పీ కన్నా ఎక్కువ కెపాసిటీ బోర్లు ఉన్న రైతులకు ఎన్‌టీఆర్ శ్లాబ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దానిని అమలు చేయకుండా చంద్రబాబు నిరంకుశంగా నెలవారీ బిల్లు విధానం పెట్టడం రైతులకు ఇబ్బందికరంగా ఉండేది. బోర్లకు వచ్చిన కరెంటు బిల్లులు కట్టలేక వేలాది రూపాయలు బకాయిలు పడ్డాం. వైఎస్ పుణ్యమా అని వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా జరిగింది.
- అచ్చా అప్పారావు, రైతు, మాజీ సర్పంచ్, ఎ.కొత్తపల్లి, తొండంగి మండలం
ఆయన పాలన నరకమే
నాకు నాలుగెకరాల మెట్ట భూమి ఉంది. 2004కు ముందు తొమ్మిదేళ్ల కాలం రైతులకు నరకప్రాయమే అయ్యింది. కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. చార్జీలను తరచూ పెంచడంతో రైతులం చాలా ఇబ్బందులు పడ్డాం.
- కారింగి అప్పారావు, రైతు, భీముడుపాకలు, అడ్డతీగల మండలం
బిల్లు కట్టకపోతే ఫ్యూజ్ కట్
చంద్రబాబు పాలనలో పండిన పంట మీద వచ్చిన ఆదాయం బోరు బిల్లులు కట్టడానికి సరిపోయేది. ఒక్కోసారి అప్పు చేసి మరీ బిల్లులు చెల్లించేవాళ్లం. బిల్లులు కట్టకపోతే ఫ్యూజులు పీకేసేవారు. రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు.
- సోమిశెట్టి రాంబాబు, రైతు, గొల్లప్రోలు
బాబు పాలన రైతులకు దుర్భరం
చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్ల పాలనలో దుర్భర జీవితం గడిపాం. పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా లేకపోవటం మోటార్లు సక్రమంగా పనిచేసేవికావ. నెలానెలా బిల్లుల్లు మోతెక్కడంతో ఆర్థికంగా ఇబ్బందిగా ఉండేది. ఇచ్చిన ఏడుగంటలు మూడుదఫాలుగా ఉండటంతో రైతుకు ఏమాత్రం ఉపయోగపడేదికాదు. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి పాలనలో ఉచిత కరెంటు, తొమ్మిది గంటల నిరంతర సరఫరా ఉండేది.
- పాశిల లచ్చబాబు, రౌతులపూడి
రైతులపై కేసులు బనాయించిన ఘనుడు
రైతుల పొలాలకు ఏనాడూ సకాలంలో విద్యుత్తు సక్రమంగా అందించలేదు. మరోపక్క విద్యుత్తు బిల్లులు సకాలంలో చెల్లించలేదంటూ అధికారులతో రైతులపై అక్రమ కేసులు బనాయించిన ఘనత చంద్రబాబుదే.
- పిల్లి అప్పారావు, రైతు, కాండ్రేగుల, పెదపూడి మండలం
ఎకరా తడికి మూడురోజులు పట్టేది..
చంద్రబాబు హయాంలో పంటలు పండించడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చేది. సక్రమంగా విద్యుత్ సరఫరా లేక ఎకరా చేను తడపాలంటే మూడురోజులు పట్టేది. పంటలు నష్టపోయేవాళ్లం. నష్టాల పాలైన కౌలు రైతులు మళ్లీ కౌలుకు భూములు సాగు చేయకూడదని అనుకునేవాళ్లం. కుటుంబపోషణార్థం విధి లేకమళ్లీ సాగుకు దిగేవాళ్లం.
- కుర్రే సోమన్నదొర, శంఖవరం
నీరు పారకపోయినా బిల్లులు మాత్రం వచ్చేవి..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు ఇబ్బందులు పడ్డారు. బోర్లు పారేవి కావు. కరెంట్ బిల్లులు మాత్రం వచ్చేవి. కట్టకపోతే ఫ్యూజులు తీసేవారు. తీవ్రంగా ఇబ్బందులు పడ్డాం.
- సింగం వీర్రాఘవులు, సీతానగరం, జగ్గంపేట మండలం
ఎడపెడా చార్జీల మోతే..
విద్యుత్ చార్జీల విషయంలో ఎన్టీ రామారావు విధించిన స్లాబు పద్ధతిని చంద్రబాబునాయుడు పాలనలో ఎత్తేశారు. ఒకపక్క విద్యుత్ చార్జీల మోత, మరోపక్క ట్రాన్స్‌కో అధికారుల దాడులతో అప్పట్లో ఆందోళనకు గురయ్యాను. తరచూ అధికారులు తనిఖీలు చేసి మోటారు సామర్థ్యం ఎక్కువగా ఉందని, కెపాసిటర్ ఏర్పాటు చేయలేదని పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు.
- పరవాడ అప్పారావు, కుమ్మరిలోవ, తుని మండలం