రుణాల మాఫీపై సీఈసీకి ఫిర్యాదు
ఓటర్లను మభ్యపెట్టే పార్టీలపై చర్యలకు విజ్ఞప్తి
ఆచరణ సాధ్యం కానీ హామీలిస్తున్న టీడీపీ, టీఆర్‌ఎస్‌లపై ధ్వజం
సాక్షి, సిటీబ్యూరో: అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇవ్వడాన్ని ఆమ్ ఆద్మీపార్టీ తప్పుపట్టింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఉన్నపుడు, రూ.లక్ష కోట్ల రుణాల మాఫీ హామీ ఎలా సాధ్యం అని ‘ఆప్’ ప్రశ్నించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీఆర్‌ఎస్ నేత కేసీఆర్‌లు ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా, ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారని ‘ఆప్’ ఆరోపించింది. తప్పుడు హామీలతో ఓటర్లను మభ్య పెడుతున్న నేతలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది.
గురువారం రాజ్‌భవన్‌రోడ్డులోని ఆమ్‌ఆద్మీపార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ సీమాంధ్ర ప్రచార కమిటీ కన్వీనర్ బి.రామకృష్ణంరాజు, సభ్యులు విస్సా కిరణ్‌కుమార్, స్నేహలత మాట్లాడారు. సీమాంధ్రలో ప్రభుత్వోద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి ఉంది. తెలంగాణలోనూ స్తబ్దత నెలకొంది. ఈ పరిస్థితుల్లో లక్షల కోట్ల రుణాలు ఈ ఇద్దరు నేతలు మాఫీ చేస్తామని ఎలా హామీ ఇవ్వగలుగుతున్నారని వారు నిలదీశారు. ఓటర్లను మభ్యపెడుతున్న నేతలపై చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు వారు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక రుణాలు మాఫీ చేస్తామని, ఇప్పటి వరకు రుణాలు చెల్లించవద్దని రైతులకు, మహిళలకు టీడీపీ అధినేత పిలుపు ఇవ్వడం వల్ల బ్యాంకులు రుణాలు ఇవ్వడం పూర్తిగా మానేశాయన్నారు. దీంతో చిన్న, సన్నకారు రైతులు పంట రుణాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తాత్కాలిక ప్రలోభాలకు లొంగకుండా ఆదర్శవంతులు, నిజాయితీపరులకు ఓటేసి గెలిపించాలని వారు కోరారు.
బాబు హామీలపై భగ్గుమన్న ‘ఆప్’
Published Fri, Apr 4 2014 3:57 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement