సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఒకరు మిస్టర్ లెజెండ్.. మరొకరు ఫైర్‌బ్రాండ్.. ఇంకొకరు మిస్టర్ కూల్ ఈ ముగ్గురివి మూడు ఏజెండాలు. జిల్లాలో ఈ ముగ్గురి నియోజకవర్గాల మీదనే ఆసక్తికర చర్చ సాగుతోంది. రాష్ట్రం మొత్తాన్ని ఒంటి చేత్తో గెలిపిస్తాననే మిస్టర్ లెజెండ్ కేసీఆర్ గజ్వేల్‌కు వచ్చేసరికి నన్ను మీరే గెలిపించాలని కోరుతున్నారు. ఇక మాటలతోనే ప్రత్యర్థులకు దడ పుట్టించే జగ్గారెడ్డి ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒక మెట్టు దిగి ముస్లిం, ఉద్యోగుల ఓట్లకు గాలం వేస్తున్నారు. ముఖం మీద చిరు నవ్వును చెరగనివ్వని నందీశ్వర్ సెటిలర్ల ఓట్లను ఒడిసిపట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. కొద్దిగా ఒడిదొడుకులు ఉన్నా గెలిచి తీరుతామని ఈ ముగ్గురూ ఘంటాపథంగా చెప్తున్నారు.
చెమట తీయాల్సిందే..
సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ అసెంబ్లీ బరిలో నిలబడ్డారు. గజ్వేల్ నుంచి పోటీచేస్తున్న కేసీఆర్ కొత్త నినాదం అందుకున్నారు. ‘తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని నేను గెలిపించుకొని వస్తా... నన్ను మాత్రం మీరు గెలిపించాలి’ అని అంటున్నారు. ఈ మాటతో రాజకీయ విశ్లేషకులు ఎవరికి తోచిన విధంగా వాళ్లు విశ్లేషిస్తున్నారు. ఇక్కడ నిలబడిన టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కేసీఆర్‌కు గట్టిపోటీ ఇస్తున్నారని, పోలింగ్ నాటికి కేసీఆర్ గెలుపు ముంగిట నిలబడవచ్చు గాని, అది కేసీఆర్‌లాంటి నేత స్థాయికి తగిన మెజార్టీ మాత్రం రాకపోవచ్చని, కొద్ది మెజార్టీతో కేసీఆర్ గెలిచినా... నైతికంగా ఓడినట్టే అని విశ్లేషకులు అంటున్నారు.
ఉద్యో గ సంఘాలు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలబడ్డాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ప్రతాపరెడ్డికి వ్యక్తిగతంగా మంచి పేరుంది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నియోజకవర్గాన్నే అంటిపెట్టుకొని ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి ఆయన మీద బలంగా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయక ఓటింగ్ ఉంది. దీనితో పాటు నర్సారెడ్డికి వ్యక్తిగతంగా గ్రామస్థాయి నాయకత్వంతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కేసీఆర్ గెలుపునకు చెమటోడ్చక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సెటిలర్లు చేసే ‘పఠాన్’
పటాన్‌చెరులో 30 వేల మంది సెటిలర్స్ ఉన్నారు. గెలుపు ఓటముల్లో సెటిలర్లే కీలకం. అన్ని పార్టీలు సెటిలర్ల మీదనే దృష్టిపెట్టారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చి స్థిరపడిన వీళ్లు టీఆర్‌ఎస్ వైపునకు వెళ్లే అవకాశం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. సెటిలర్ల ఓట్లు దండుకోవడానికి కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, టీడీపీలు పోటీ పడుతున్నాయి. జిల్లాలో టీడీపీకి పూర్తిగా వ్యతిరేక పవనాలు వీస్తున్న వేళ సెటిలర్లు కూడా గెలుపు గుర్రాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్‌సీపీవైపు సెటిలర్స్ మొగ్గుచూపుతున్నారు. వైఎస్సార్ అమలుచేసిన సంక్షేమ పథకాలతో పాటు, సమైక్యాంధ్ర కోసం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పోరాటం నేపథ్యంలో వీళ్ల ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉంది. ఇక అభివృద్ధి పరంగా చూసినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా నందీశ్వర్‌కు కూడా సెటిలర్లు అండగా నిలిచే అవకాశం ఉంది.
ఉద్యోగుల బాసట : ఇక తూర్పు జయప్రకాశ్‌రెడ్డి ఉద్యోగుల మీదనే ఆశలు పెట్టుకున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఉద్యోగులు జగ్గారెడ్డికి అండగా నిలబడ్డారు. 2004, 2009 ఎన్నికల్లో బ్యాలెట్ ఓట్లలో అధిక శా తం జగ్గారెడ్డికి వచ్చాయి. ప్రస్తుత ఎన్నికల్లో సైతం ఉద్యోగులు తనవెన్నంటే ఉంటారని జగ్గారెడ్డి భావిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే సీఎంలతో తనకు ఉన్న సాన్నిహిత్యంతో వాటి పరిష్కారానికి కృషి చేసేవారు. టీఎన్జీవో భవన్‌ల నిర్మాణానికి ఆర్థికంగా చేయూతనందించడంతోపాటు ఉద్యోగుల సమస్యలను ఆయన పరిష్కరించిన విషయాన్ని ప్రస్తుతం ఉద్యోగసంఘాల నాయకులు గుర్తుచేసుకుంటున్నా రు. సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రస్తుతం సుమారు 3 వేల మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులతోపాటు వారి కుటుంబసభ్యుల ఓట ర్లను పరిగణనలోకి తీసుకుంటే సుమారు 12 నుంచి 15 వేల ఓట్లు ఉంటా యి. దీంతో ఉద్యోగుల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి.
ముగ్గురూ.. ముగ్గురే!
Published Tue, Apr 29 2014 12:10 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
Advertisement
Advertisement