21, 25 తేదీల్లో తెలంగాణకు రాహుల్?
27న మెదక్‌లో సోనియా సభ!
ప్రచార కార్యక్రమాలపై జైరాంతో పొన్నాల, దామోదర భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పాల్గొన్న కరీంనగర్ బహిరంగ సభ ఆ జిల్లా శ్రేణుల్లో ఉత్తేజం నింపడంతో... జిల్లాకో బహిరంగ సభ నిర్వహించి సోనియాగాంధీ పాల్గొనేలా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌తో గురువారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, కో-చైర్మన్ షబ్బీర్‌అలీ భేటీ అయి... తెలంగాణలో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలు, బహిరంగ సభలపై చర్చించారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేయిస్తే బాగుంటుందనే సూచనలు వచ్చాయి.
అందులో భాగంగా జిల్లాకో బహిరంగ సభను నిర్వహిద్దామని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మరో 10 రోజులే ఉండటంతో జిల్లాకో బహిరంగ సభ నిర్వహించడం సాధ్యం కాదని చెప్పిన దిగ్విజయ్‌సింగ్... నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రాహుల్‌గాంధీ, మెదక్‌లో సోనియాగాంధీ పాల్గొనేలా ఒప్పిస్తానని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఈ నెల 21, 25 తేదీల్లో రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. దీంతో నిజామాబాద్, హైదరాబాద్, మహ బూబ్‌నగర్ జిల్లాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు టీ పీసీసీ నేతలు సిద్ధమయ్యారు. అలాగే 27న సోనియా మెదక్‌కు వచ్చే అవకాశమున్నందున భారీ బహిరంగ సభ ఏర్పాటు పనిలో నేతలు నిమగ్నమయ్యారు.
కరీంనగర్ సభపై దిగ్విజయ్‌సింగ్ అసంతృప్తి?
కరీంనగర్ బహిరంగ సభ విజయవంతమైందని టీ పీసీసీ నేతలు చెబుతున్నప్పటికీ... దిగ్విజయ్‌సింగ్ మాత్రం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 60 ఏళ్ల కల నెరవేర్చిన సోనియాగాంధీ ఐదేళ్ల తరువాత తెలంగాణకు వస్తే.. కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభ నిర్వహిస్తారని ఆశించామని, తీరా చూస్తే 50 వేల మందికి మించి కనిపించలేదని అన్నట్లు సమాచారం. గురువారం ఆయన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఫోన్ చేసి దీనిపై తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది.