
కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను రద్దు చేయాలి
టీయూడబ్ల్యూజే ‘మీట్ ది ప్రెస్’లో
టీ.టీడీపీ కన్వీనర్ మోత్కుపల్లి
శ్రీకాంతచారితల్లికి సీటిస్తే
నేను పోటీ నుంచి తప్పుకుంటా: ఎర్రబెల్లి
హైదరాబాద్: ‘తెలంగాణ వచ్చేదా, సచ్చేదా అనుకున్నడు కేసీఆర్. అందుకె ఎక్కడ మైకు పట్టుకున్న తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడె, డిప్యూటీ సీఎంగా ముస్లింను చేస్తనన్నడు. తీరా తెలంగాణ వచ్చెటప్పటికి ఇప్పుడు ఊసెత్తుత లేడు. కేసీఆర్ చరిత్రలో నిలిచిపోవాలన్న, ఆదర్శవంతమైన నాయకుడిగా నిలువాలన్న... తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన గద్దర్‌ను, విమలక్కను, జేఏసీ నేతలను, ఉద్యోగ, విద్యార్థి సంఘాలను, రాజకీయ పార్టీలను పిలిచి టీఆర్‌ఎస్‌ను రద్దు చేస్తున్నట్టు చెప్పాలె.
నేను, నా కొడుకు, కోడలు, అల్లుడు రాజకీయాల్లో ఉండకూడదా అని అడగడం ఏం ఉద్యమం?’ అని తెలంగాణ తెలుగుదేశంపార్టీ కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై విరుచుకుపడ్డారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమం 60 ఏళ్లుగా సజీవంగా ఉందని, రాజకీయ ఉద్యోగం కోసమే కేసీఆర్ ఆ ఉద్యమాన్ని అందుకున్నారని మోత్కుపల్లి దుయ్యబట్టారు. కేసీఆర్ ఉద్యమంలో గానీ, రాజకీయాల్లో గాని నిజాయితీ ఉంటే చెరుకు సుధాకర్ వంటి నాయకుడు ఎందుకు ఆ పార్టీని వీడుతున్నాడని ప్రశ్నించారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని సామాజిక తెలంగాణ నినాదంతో టీడీపీ వెళుతుందని తెలిపారు.
‘‘తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన తొలి వ్యక్తి శ్రీకాంతచారి కుటుంబానికి టిక్కెట్టు ఇవ్వమంటే ఓడిపోయే హుజూర్‌నగర్ ఇస్తనన్నడు. పాలకుర్తిలో ఇవ్వు. నేను పోటీ చేయ్యకుండ మద్దతిస్త’ అని దయాకర్‌రావు చెప్పారు. చంద్రబాబు బీసీని సీఎం చేస్తానని చెప్పారే తప్ప కృష్ణయ్యను సీఎం చేస్తానని చెప్పలేదన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు రెండు పార్టీలకు అవసరమేనని, పొత్తు వల్ల బీజేపీకి మూడు శాతం ఓట్లు పెరుగుతాయన్నారు.