
బహుముఖ పోరు.. ఎవరిదో టాప్ గేరు?
ఏ రాజకీయ నాయకుడి నోట విన్నా ఇప్పుడు ఆ సీటు మాటే. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు అత్యధిక మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దేశంలోనే పెద్ద లోక్సభ నియోజకవర్గంగా అవతరించిన మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు నాయకులు క్యూ కడుతున్నారు. ఇక్కడ విద్యావంతులకు తోడు దేశంలోని వివిధ రాష్ట్రాలు, రాష్ట్రంలోని సీమాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన జనం పెద్దసంఖ్యలో ఉండడంతో ఆశావహులు ఈ సీటుపై కన్నేశారు.
కొత్తగా పుట్టుకొచ్చిన జై సమైక్యాంధ్ర పార్టీ కూడా ఇక్కడి నుంచి తమ అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తోంది. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ను ఇక్కడి నుంచి పోటీకి పెట్టాలని యోచిస్తోంది. ఉండవల్లిని బరిలోకి దింపడం ద్వారా తమ ఉనికిని చాటుకోవాలని జై సమైక్యాంధ్ర పార్టీ భావిస్తోంది. తద్వారా తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తోంది.
కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ, లోక్సత్తా తరపున జయప్రకాష్ నారాయణ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థిగా చందన చక్రవర్తి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఎమ్మెల్సీ నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. మిగతా పార్టీల తరపున రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇక్కడ బహుముఖ పోరు తప్పదని అర్థమవుతోంది. మల్కాజ్గిరి సమరం రసవత్తరంగా సాగుతుందనడంతో ఎటువంటి సందేహం లేదు. అంతిమంగా మల్కాజ్గిరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.