నల్లారికి సబ్బం హరి షాక్
విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డికి అనకాపల్లి ఎంపీ సబ్బం హరి షాక్ ఇచ్చారు. ఎన్నికల పోలింగ్కు ఒక్కరోజు ముందు కిరణ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. జై సమైక్యాంధ్ర పార్టీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైనప్పటి నుంచి సబ్బం హరి... కిరణ్ పంచన చేరారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టడానికి కారణమైన వారిలో సబ్బం హరి కూడా ఒకరు. ఇప్పుడు ఆయనే పార్టీని వీడారు.
ఇంతకుముందు కిరణ్ వెంట నడిచిన పితాని సత్యనారాయణ, ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్ తర్వాత తమదారి తాము చూసుకున్నారు. ఈ ముగ్గురు నాయకులు టీడీపీలో చేరి కిరణ్కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. తాజాగా సబ్బం హరి కూడా కిరణ్ను వీడారు. పోలింగ్ ఒక రోజు ముందు మీడియా ముందుకు వచ్చిన సబ్బం హరి... పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అనారోగ్యం కారణంగానే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. సబ్బం హరి ఇచ్చిన షాక్ నుంచి కిరణ్ ఎలా కోలుకుంటారో చూడాలి.