మల్లారెడ్డిపై చర్యలు తీసుకోండి: వైఎస్సార్‌సీపీ
* కాలేజీల వివరాలు ఇవ్వలేదు
* ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న సీహెచ్ మల్లారెడ్డి తనకున్న మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల సమాచారాన్ని దాచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యా దు చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తన కాలేజీల వివరాలు ఇవ్వకుండా నిబంధనలు ఉల్లంఘించారని, అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. మంగళవారం ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ను కలిసిన పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్, ట్రేడ్ యూనియన్ విభాగం అధ్యక్షుడు బి.జనక్ ప్రసాద్, లీగల్ సెల్ కన్వీనర్ సి.నాగేశ్వర్‌రావు ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను అందజేశారు.
ఫిర్యాదులో వివరాలు..: వివిధ విద్యా సంస్థల అధినేతగా అందరికి తెలిసిన మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం ఆ వివరాలను వెల్లడించలేదని పేర్కొన్నారు. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 నిబంధనల ఉల్లంఘనేనని, సమాచారాన్ని వెల్లడించకుండా దాచే ప్రయత్నం చేశారని తెలిపారు. ఆయన 19 విద్యా సంస్థలకు వ్యవస్థాపక చైర్మన్‌గా, ఇతర హోదాల్లో ఉన్నారని పేర్కొన్నారు. అందులో 9 ఇంజనీరింగ్ కాలేజీలు, 3 ఫార్మసీ కాలేజీలు, 5 మేనేజ్‌మెంట్, బిజినెస్ కాలేజీలు, ఒక మెడికల్ కాలేజీ, పీజీ కాలేజీల్లో ఆయనకు భాగస్వామ్యం ఉన్నట్లు తెలిపారు. ఆయనకున్న ఈ కాలేజీల పేర్లతోపాటు వివరాలను ఫిర్యాదులో పొందుపరిచారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయనపై తగిన చర్యలు చేపట్టాలని కోరారు.