సాక్షి, గుంటూరు: నెల రోజులుగా జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో హోరెత్తిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. అభ్యర్థుల జాబితా వెలువడిన నాటి నుంచి వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ర్యాలీలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలతో హోరెత్తించారు. నామినేషన్ల నాటి నుంచి జన సమీకరణ కోసం నానాపాట్లు పడ్డారు. ఇక ప్రచారం చాలించి విశ్రాంతికి ఉపక్రమించారు. ఓటరు తీర్పు ఎలా ఉండబోతోందోనని గుబులు మాత్రం వారిని వెన్నాడుతూనే ఉంది. మొదటి నుంచి వైఎస్సార్ సీపీ ప్రచారంలో ముందుండగా.. అభ్యర్థుల ఎంపిక లోనే తడబాటు పడిన టీడీపీ మాత్రం ప్రచారంలోనూ వెనుకబడింది.
ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతో జిల్లాలో ఒకటి రెండు చోట్ల మినహా కాడిపడేశారు. మరికొందరు టీడీపీ పంచన చేరిపోయారు. జిల్లా వ్యాప్తంగా మూడు పార్లమెంట్ స్థానాలకు 37 మంది, 17 అసెంబ్లీ స్థానాలకు 239 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. మరో 24 గంటల్లో జమిలి ఎన్నికల జరగనున్న నేపథ్యంలో జిల్లాలో మొత్తం మూడు పార్లమెంట్, 17 అసెంబ్లీ స్థానాల్లో అధికారులు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు ప్తూచేశారు. మావో ప్రభావిత ప్రాంతాలు అధికంగా ఉన్న మాచర్ల, వినుకొండ, గురజాల, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు, మిగతా 13 స్థానాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
20 మంది పోలీసులతో బందోబస్తు.: రాత్రి వేళల్లో డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ప్రత్యేక బృం దాలను నియమించినట్లు గుం టూరు రూరల్, అర్బన్ ఎస్పీలు జె.సత్యన్నారాయణ, జెట్టి గోపీనాథ్‌లు తెలిపారు. జిల్లాలో మొత్తం 20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మావోయిస్ట్, ఫ్యాక్షన్ గ్రామాలు అధికంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో కేంద్ర బలగాలను మోహరింపజేసి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
పరువు కోసం టీడీపీ అడ్డదారులు.: ప్రచారం ముగియడంతో రాజకీయ పార్టీల అభ్యర్థులు అజ్ఞాతంలోకి వె ళ్లిపోయారు. టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు తెర వెనుక మంత్రాంగం నడుపుతూ పట్టు కోసం పాకులాడుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని అడ్డుకుని, ఎలాగైనా పరువు దక్కించుకోవాలని అడ్డదారులు తొక్కుతున్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు వారిని ఎలాగైనా తమవైపుకు తిప్పుకోవాలని తంటాలు పడుతున్నారు. ప్రతిష్టాత్మకంగా గెలుపు కోసం ప్రయత్నిస్తున్న చోట ఓటుకు రూ.3 వేల వరకు పంపిణీ చేస్తున్నారు.
ష్..! ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం
Published Mon, May 5 2014 11:50 PM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement