నితీశ్ ఔట్, బీహార్ కొత్త సీఎంగా మాఝీ
మోడీ ఎఫెక్ట్ తో ఒక పెద్ద వికెట్ పడిపోయింది. నితీశ్ కుమార్ స్థానంలో బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా జీతన్ రామ్ మాఝీ ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో బీహార్ లో అధికార జనతాదళ్ యునైటెడ్ ఘోరపరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకునేందుకు ససేమిరా అనడంతో చివరికి జనతాదళ్ యునైటెడ్ మాఝీని పార్టీ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాడు.
మాఝీ మక్దూమ్ పురా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం బీహార్ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.
అంతకు ముందు నితీశ్ మాఝీని వెంట తీసుకుని వెళ్లి గవర్నర్ ను కలిశారు. ఆ తరువాత తన స్థానంలో మాఝీ సీఎంగా ఉంటారని ప్రకటించారు.
బీజేపీ నుంచి, ఎన్డీఏ కూటమి నుంచి జనతాదళ్ వేరుపడ్డ తరువాత జరిగిన ఎన్నికల్లో మొత్తం నలభై స్థానాల్లో జేడీయూ కేవలం 2 స్థానాలు గెలుచుకుంది. బిజెపి నుంచి వేరుపడాలని నితీశ్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన శరద్ యాదవ్ వర్గం ఆయన రాజీనామాను కోరుతోంది. అయితే తన అనుచరుడినే సీఎంగా చేసి నితీశ్ యాదవ్ పై పైఎత్తు వేశారు. మరో వైపు 2015 ఎన్నికల్లో పార్టీ మళ్లీ గెలిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని కూడా నితీశ్ స్పష్టం చేశారు.