జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ?
గత ఎన్నికల్లో సందడి చేసిన చిన్న ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాలకే పరిమితమయ్యారు. ఎన్నికల హడావుడి తారాస్థాయి చేరినా బుల్లి తారక రాముడు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఎన్నికల గురించి ఎక్కడా మాట్లాడినట్టు కూడా లేదు. తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ తరపున గత ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసిన జూనియర్ జాడ లేకపోవడంతో అభిమానులు అసంతృప్తికి గురవుతున్నారు.
2009 ఎన్నికల్లో స్టార్ కాంపైనర్గా టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. తన వాళ్లకు కూడా టిక్కెట్లు ఇప్పించుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగు తమ్ముళ్లు బుల్లి ఎన్టీఆర్వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదు. పలకరించే సాహసం కూడా చేయడం లేదు. నారా వారసుడికి పోటీ వస్తాయన్న భయంతో చంద్రబాబు జూనియర్ను పక్కనపెట్టారు. అటు హరికృష్ణ కూడా సమయం దొరికినప్పుడల్లా బావపై విమర్శనాస్త్రాలు సంధిస్తుండడంతో ఆ ప్రభావం జూనియర్పై పడింది.
లోకేష్ను తెర ముందుకు తేవాలన్న ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు సహజంగానే చిన్న ఎన్టీఆర్పై శీతకన్నేశారు. ఇక పవన్ కళ్యాణ్ అడగకుండానే ఆయాచితంగా మద్దతు ప్రకటించడంతో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేకుండా పోయింది. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రచారం చేసినా పెద్దగా ఫలితం లేకపోవడం, అతడి సినిమాలు ఈమధ్య ఆడకపోవడంతో జూనియర్కు టీడీపీ అధినేత ఈసారి చేయి ఇచ్చారు. మామయ్య నుంచి పిలుపు రాకపోవడంతో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. మరోవైపు తమ హీరోను చంద్రబాబు పట్టించుకోకపోవడాన్ని ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు. తమ అభిమాన కథానాయకుడికి మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశాభావంతో ఉన్నారు.