కమలానికిపచ్చకామెర్లు
- టీడీపీ సహ‘కారం’పై బీజేపీ నేతల అసంతృప్తి
- ప్రచారానికి కలసి రావడం లేదని ఆవేదన
- ప్రతీకారంతో రగిలిపోతున్న నాయకులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : భారతీయ జనతా పార్టీ, టీడీపీల మధ్య పొత్తు వికటిస్తోంది. ఢిల్లీ స్థాయిలో ఈ రెండు పార్టీ అధినాయకత్వాల మధ్య కుదిరిన ఒప్పందం.. కింది స్థాయి శ్రేణులను కలపలేకపోతోంది. ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులకు బీజేపీ నాయకులు సహకరిస్తున్నా టీడీపీ నుంచి మాత్రం ఆ స్థాయిలో కమలనాథులకు మద్దతు లభించడం లేదు. దీంతో జిల్లాలో విశాఖ ఎంపీ అభ్యర్థితోపాటు విశాఖ-ఉత్తరం, పాడేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగుదేశం శ్రేణులు లేకుండానే ఒంటరిగానే ప్రచారాలను సాగిస్తున్నారు.
ఎంపీ స్థానానికి ఎవరికైనా ఓటేసుకోండి..
బీజేపీని దెబ్బతీసేలా టీడీపీ నేతలు ప్రచారం సాగిస్తున్నారు. విశాఖ ఎంపీ పరిధిలో జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి విషయాన్ని కనీసం ప్రస్తావించడం లేదు. అంతేకాకుండా ఎంపీతో తమకు సంబంధం లేదని, నచ్చిన పార్టీకి వేసుకోవచ్చని, ఎమ్మెల్యేకు మాత్రం తమకే ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కొన్ని చోట్ల ఇతర పార్టీలతో అవగాహనకు వచ్చి ఎంపీ ఓటు విషయంలో వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకసారి ఈ స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తే తమకు భవిష్యత్తు ఉండదని టీడీపీ నేతలు సహకరించడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ కోటరీ అతి కారణంగా ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా బీజేపీకి సహాయ నిరాకరణ చేస్తుండడంతో మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
ప్రచారాలకు ప్యాకేజీ ఇవ్వాల్సిందే
బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారానికి రావాలంటే లక్షల్లో ప్యాకేజీ కావాలంటూ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. లేనిపక్షంలో వ్యతిరేకంగా పనిచేస్తామంటూ కొంతమంది బాహాటంగానే చెబుతున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండాపోతోంది. జిల్లాలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న 2 లోక్‌సభ, 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీకి సహకరించకూడదని బీజేపీ నాయకులు ఆలోచన చేస్తున్నారు. టీడీపీని నమ్ముకొని పెద్ద తప్పే చేశామంటూ ఇప్పుడు మధనపడుతున్నారు. పోలింగ్ సమయం దగ్గరపడుతుండడంతో టీడీపీ సహకారం లేకుండానైనా ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. తమ ఓట్లు టీడీపీ అభ్యర్థులకు బదిలీ కాకుండా చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు.