టి.బిల్లులో టీఆర్ఎస్ పాత్రలేదు:కేసీఆర్
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్-టీఆర్ఎస్ ల మధ్య వాడివేడి మాటల యుద్ధం జరుగుతోంది. టి.బిల్లులో టీఆర్ఎస్ పాత్ర లేదని నిన్నటి కరీంనగర్ సభలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యలను టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఈ రోజు ఎన్నికల రోడ్ షోకు హాజరైన కేసీఆర్.. 'టి.బిల్లులో మా పాత్ర లేదు.ఉందని ఎవరు చెప్పారు. మా పార్టీ పాత్రలేని కారణంగానే ఆశించిన తెలంగాణ రాలేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.లక్షకు పైగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడుల కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. టీడీపీతో పొత్తు వద్దని తెలంగాణ బీజేపీ నేతలు మొరపెట్టుకున్న సంగతిని మరోమారు కేసీఆర్ గుర్తు చేశారు.
తమ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని నిన్నటి సభలో సోనియా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగాలతో ఎప్పుడూ ఆకట్టుకునే కేసీఆర్ మరోమారు అదే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తమ పాత్ర ఉందని ఎవరు చెప్పారంటూనే కాంగ్రెస్ కు చురకలంటించారు. ఒకవేళ టీఆర్ఎస్ పాత్ర ఉంటే..తాము ఆశించిన రాష్ట్రం సిద్ధించేదని ఓటర్లును ఆకర్షించే యత్నం చేశారు.