కేసీఆర్‌ది పదవీ కాంక్ష
అందుకే.. తెలంగాణను తాకట్టు పెట్టారు
ఉద్యమ ద్రోహులకు టికెట్లు ఇచ్చారు
సామాజిక తెలంగాణే కాంగ్రెస్ లక్ష్యం
నేటి రాహుల్ సభకు భారీ జనసమీకరణ
టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల
తన పదవి కోసం టీఆర్‌ఎస్ అధినేత తెలంగాణను తాకట్టుపెట్టారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. దళితుడిని సీఎం, ముస్లింను డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పి... మాటమార్చిన మోసకారి అని విమర్శించారు. పదవీ కాంక్ష కోసం మరోసారి తెలంగాణ నినాదం ఎత్తుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ద్రోహులకు ఈ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంత ప్రజలు కృతజ్ఞత చాటి అధికారంలోకి తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు విశ్వసనీయతకు మారుపేరని కొనియూడారు. హన్మకొండలోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొన్నాల మాట్లాడారు. 1956 నుంచి ఇప్పటి వరకు వివిధ దఫాల్లో తొలి నుంచి కాంగ్రెస్‌వాదులే తెలంగాణ ఆకాంక్షను చాటిచెబుతూ వచ్చారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాది కీలకమైన పాత్రగా అభివర్ణించారు. బీజేపీ ద్వంద ప్రమాణాలు పాటించి, అడ్డంకులు కల్పించినా సోనియా పట్టుదలతో వ్యవహరించి తెలంగాణ ప్రజల కల సాకారం చేశారని పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధికి 5 సూత్రాలు
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని ఐదు సూత్రాలతో అభివృద్ధి చేస్తామని పొన్నాల చెప్పారు. సుస్థిర ప్రభుత్వం, సుపరిపాలన, సామాజిక భాగస్వామ్యం, ఆత్మగౌరవం, బంగారు తెలంగాణే లక్ష్యమ న్నారు. అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియా, ఇంటి వసతి కల్పిస్తామన్నారు. కేసీఆర్ అవమాన పరిచిన జయశంకర్ సార్ పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసి ఆదుకుంటామన్నారు. లక్ష ఉద్యోగాల కల్పనతోపాటు వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతామన్నారు. రైతులకు పగలే ఏడు గంటలపాటు ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి గురించి ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఈయన పార్లమెంట్‌కు 14 శాతం మాత్రమే హాజరయ్యారని దెప్పిపొడిచారు. గోదావరి జలాల కోసం ఉద్యమిం చిన చరిత్ర, భూపాలపల్లిలో థర్మల్‌పవర్ స్టేషన్ ఏర్పాటుకు చేసిన కృషి గురించి కేసీఆర్‌కు ఏం తెలుసన్నారు.
నేటి సభకు భారీగా జనసమీకరణ
మడికొండలో శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే రాహుల్ సభకు ఏర్పాట్లు పూర్తయ్యూయని పొన్నాల చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని విభాగాల శ్రేణులతోపాటు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు.
రేపు ఆసిఫాబాద్‌లో నాయకుల సమావేశం
ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో 26న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకుల సమావేశం ఏర్పాటు చేసినట్లు పొన్నాల తెలిపారు. 27న మెదక్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ ఉందన్నారు. ఈ సభకు సోనియాగాంధీ హాజరుకానున్నట్లు తెలిపారు. 28న జనగామలో జరిగే రోడ్‌షోకు జయప్రద హాజరవుతారని వెల్లడించారు. సమావేశంలో కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, నాయకులు డాక్టర్ బండా ప్రకాష్, సాంబారి సమ్మారావు, రాజనాల శ్రీహరి, ఈవీ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.