విలీనం కోసమే తెలంగాణ ఇచ్చారా ?: కేసీఆర్ | KCR slams Rahul gandhi | Sakshi
Sakshi News home page

విలీనం కోసమే తెలంగాణ ఇచ్చారా ?: కేసీఆర్

Published Wed, Apr 23 2014 3:01 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

KCR slams Rahul gandhi

* రాహుల్‌గాంధీ పిచ్చికూతలు మానుకోవాలి: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్
* ఢిల్లీకి మేము గులాములం కాబోము.. మా సత్తా చూపిస్తాం
* కాంగ్రె సోళ్లు లఫంగీలు, సన్నాసులు
* ఈ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ దేశంలో లేకుండా పోతుంది
* భూముల కోసమే టీడీపీ-బీజేపీ దోస్తీ.. టీడీపీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలె
* ఎత్తు తగ్గించకుంటె.. పోలవరాన్ని అడ్డుకుంటం
* ఇంకా ఆంధ్రోళ్లతో పంచారుుతీ అయిపోలేదు
* నీళ్లు, కరెంటు, ఆస్తుల లెక్కలు ఉన్నయి
* ఆంధ్రోళ్ల డబ్బుతో తిరిగేటోళ్లు వీటిపై మాట్లాడుతరా?
* మన రాష్ట్రంలో మనోళ్ల ప్రభుత్వమే ఉండాలి
*వరంగల్, ఖమ్మం జిల్లాల పర్యటనలో కేసీఆర్

సాక్షి, వరంగల్/ఖమ్మం: ‘‘టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీ నం చేస్తానంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారా..? రాజకీయ పార్టీల విలీనం కోసం మీరు దేశంలో ఎన్ని రాష్ట్రాలనైనా ఏర్పాటు చేస్తారా..? ఇదేనా మీ వైఖరి..? ఇకనైనా రాహుల్‌గాంధీ పిచ్చికూతలు మానుకోవాలి. లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు..’’ అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు హెచ్చరించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని రాహుల్ అండ్ కంపెనీ దగ్గర తాకట్టు పెట్టబోమని, తమ పార్టీ సత్తా ఏమిటో చూపిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, ఇల్లెందు, కొత్తగూడెంలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడ్డారు. ‘‘కాంగ్రెస్ సన్నాసులు, చేతగానోళ్లు మీ కాగితాలు మోయవచ్చు. మేం మాత్రం సిద్ధంగా లేం. ఢిల్లీకి మేం గులాములం కాబోము. మా సత్తా ఏమిటో చూపిస్తాం’’ అని రాహుల్‌గాంధీని హెచ్చరించారు.
 
 సొంతంగా పోటీచేస్తే దొరల పాలన వస్తదా..?
 ‘‘కేసీఆర్ సొంతంగా పోటీ చేస్తే దొరల పాలన వస్తదట.. కాంగ్రెస్‌లో కలిస్తే సుస్థిర పాలన కొనసాగుతుందా..? ఇదేనా కాంగ్రెస్ బుద్ధి..? కాంగ్రెస్ నాయకులు లఫంగీలు, దద్దమ్మలు.. వారి మాటలు నమ్మొద్దు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 2012లో తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానని ఢిల్లీలో కాంగ్రెస్ నేతల గడప గడపకు తిరిగినప్పుడు ఎవరూ పట్టించుకోలేదన్నారు. దాంతో వంద అసెంబ్లీ, 16 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రం మెడలు వంచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘‘2004కు ముందు చంద్రబాబు తొక్కుడుకు పాతాళంలోకి పోయిన కాంగ్రెస్ పార్టీకి.. టీఆర్‌ఎస్ సహకారంతో ప్రాణం పోస్తే పదేండ్లు అధికారంలో కొనసాగారు. 2004 తర్వాత ఐదారునెలల్లోనే తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ ఇచ్చినట్లు భావించేవాళ్లం’’ అని కేసీఆర్ చెప్పారు.
 
పాత్ర లేనప్పుడు విలీనం ఎందుకు..
 ‘‘తెలంగాణ బిల్లు విషయంలో మా పాత్రే లేదని సోనియాగాంధీ ప్రకటించారు. అలాంటప్పుడు టీఆర్‌ఎస్ విలీనం విషయమెందుకు?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభంజనాన్ని గుర్తించిన కాంగ్రెస్ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వాతావరణం సరిగా లేదంటూ తన హెలికాప్టర్‌కు ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వకుండా ప్రతిరోజు ఆలస్యం చేస్తూ కాంగ్రెస్ నేతలు లంగతనం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల అనంతరం దేశంలో, రాష్ట్రంలో ఆ పార్టీ దిక్కు లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు.
 
నా వెంట్రుక కూడా వంచలేరు..
 ‘‘హైదరాబాద్‌లో కబ్జాకు గురైన భూములపై విచారణ చేపడతామని మేం అంటే.. కాంగ్రెసోళ్లు నా ఆస్తులపై విచారణ జరుపుతామని అంటున్నారు. నాకు ఉన్నది ఏంటిది తోక.. వాళ్లు నా వెంట్రుక కూడా వంచలేరు..’’ అని కేసీఆర్ ఘాటుగా విమర్శించారు.
 
 భూముల కోసమే బీజేపీ, టీడీపీ దోస్తీ..
 టీడీపీ తెలంగాణకు అడ్డుపడిందని, ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడుకు హైదరాబాద్ సమీపంలో భూములు ఉన్నాయని.. వాటిని కాపాడుకోవడానికి టీడీపీ, బీజేపీ జతకట్టాయని... టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుండా ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు.
 
 మన రాష్ట్రంలో మన జెండానే ఉండాలె..
 ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఆంధ్రోళ్లతో పంచాయితీ అయిపోలేదు. జూన్ మొదటి వారంలో నీళ్లు, కరెంట్, ఉద్యోగాలు, అప్పులు, ఆస్తులు వంటి అనేక విషయాలు తెరపైకి వస్తాయి. ఆంధ్రోళ్ల పైరవీలతో పీసీసీ పదవి తెచ్చుకున్నవారు, వారి డబ్బులతో ఎన్నికల బరిలో నిలబడ్డ వాళ్లు వీటన్నింటిపై మాట్లాడగలరా..?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. మన తలరాతలు మన చేతిలోనే ఉన్నాయని, మన రాష్ట్రంలో మన జెండానే ఉండాలని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి తప్పిదం జరిగినా రెండు మూడు తరాలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని.. మన ఆశయూల్ని సాధించుకోవాలంటే మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
 
 హామీలన్నీ అమలు చేస్తం..
 టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే తెలంగాణలో ప్రధానంగా సాగు, తాగునీరు సమస్య తలెత్తకుండా చూస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కంతనపల్లి ప్రాజెక్టును తానే దగ్గరుండి నిర్మిస్తానన్నారు. రైతులకు రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని, వితంతువులు, వృద్ధులకు రూ. 1,000 చొప్పున, వికలాంగులకు రూ. 1,500 పింఛన్ చెల్లిస్తామన్నారు. రాజకీయ అవినీతిని కడిగి పారేస్తానని చెప్పారు. ప్రతి పేదవాడికి రూ. 3 లక్షలతో రెండు గదులు, ఒక హాలు, వంటగదితో కూడిన ఇంటిని 125 గజాల స్థలంలో కట్టించి ఇస్తామన్నారు. గిరిజనులు, మైనారిటీలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్ కల్పిస్తామని, తండాలు, గూడేలను పంచాయతీలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఐకేపీ మహిళలకు రుణపరిమితి పెంచుతామని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు.
 
 పోలవరాన్ని అడ్డుకుంటం...
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ముంపు లేకుండా నిర్మించాలని.. లేదంటే అడ్డుకుంటామని కేసీఆర్ హెచ్చరించారు. ఆంధ్ర ప్రాంతంలోని రైతులకు సాగునీరు అందించేందుకు తాము వ్యతిరేకం కాదని... కానీ ఇక్కడి గిరిజనులను ముంచి పోలవరం కడితే ఎలాగని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement