టార్గెట్ కేసీఆర్ ఫలించేనా?
- కాంగ్రెస్ ప్రచారంలో మేనిఫెస్టో అంశాలు, ప్రజా సవుస్యలు గాలికి
- గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ దాకా కేసీఆర్‌పైనే
- వివుర్శలు.. వారిని రెచ్చగొట్టి ట్రాప్‌లో పడేసిన టీఆర్‌ఎస్ చీఫ్
- ఎన్నికల్లో కేంద్ర బిందువుగా మారే వ్యూహమే
- కాంగ్రెస్ నేతల తీరుపై పార్టీ శ్రేణుల్లో అయోమయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహం మారింది. పార్టీ ఎన్నికల హామీల ప్రణాళికను పక్కనబెట్టింది. ప్రజా సమస్యలనూ ప్రస్తావించడం లేదు. చివరకు తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది తమ అధ్యక్షురాలు సోనియా గాంధీయే అన్న ప్రచారాన్ని కూడా తగ్గించింది. ప్రస్తుతం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకోవడమే కాంగ్రెస్ పెద్దలకు ప్రధాన అజెండా అయింది. సోనియా, రాహుల్ సహా తెలంగాణలో ప్రచారం చేస్తున్న ఢిల్లీ నేతల నుంచి గల్లీ నాయకుల వరకు కేసీఆర్‌పై మూకుమ్మడిగా విరుచుకుపడటమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇచ్చిన మాట తప్పడంలో కేసీఆర్‌ను మించిన వాళ్లు లేరంటూ టీఆర్‌ఎస్ చీఫ్‌ని విశ్వసనీయత లేని వ్యక్తిగా చిత్రీకరించేందుకు నడుంకట్టారు.
వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలతో ఎదురుదాడి చేస్తూ కేసీఆర్‌ను టీ-కాంగ్రెస్ నేతలు ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకు కేసీఆర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాత్రమే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రాహుల్ పర్యటన అనంతరం ఒక్కసారిగా మిగతా ముఖ్యుల్లోనూ మార్పు వచ్చింది. అయితే పార్టీ నేతలంతా కేసీఆర్‌నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్నది అర్థంకాక పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. పార్టీ వ్యూహం ఎన్నికల్లో ఫలిస్తుందో లేదోగాని.. ప్రతికూలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.
కేసీఆర్ ట్రాప్‌లో పడ్డారా?
కాంగ్రెస్ పెద్దల వ్యవహారం చూస్తుంటే వారు కేసీఆర్ ట్రాప్‌లో పడ్డట్లు కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో తొలి నుంచీ కేసీఆర్.. కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఆ పార్టీ పదేళ్ల పాలనా వైఫల్యాలు, ప్రభుత్వ అవినీతితో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చవటలు, దద్దమ్మలంటూ విమర్శిస్తున్నారు. అదే సమయంలో సంపూర్ణ తెలంగాణ ఇవ్వలేదని, సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు అక్కర్లేదని పేర్కొంటూ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారు. అయినప్పటికీ నిన్న మొన్నటి వరకు కేసీఆర్‌పై పెద్దగా మాట్లాడని కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా రూటుమార్చారు. ఎక్కడికి వెళ్లినా కేసీఆర్‌ను తిడుతున్నారు. దీంతో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కేంద్ర బిందువయ్యారు. వాస్తవానికి కేసీఆర్ ఆశించింది కూడా ఇదేనని టీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఎన్నికల రాజకీయమంతా తన చుట్టూ తిరగాలనే భావనతోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పెద్దలను తన ట్రాప్‌లోకి లాగారని పేర్కొన్నాయి. సోనియా, రాహుల్ సైతం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం తెలంగాణ ప్రజల్లో చర్చనీయాంశమైంది. కేసీఆర్‌ను విశ్వసనీయతలేని వ్యక్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తే.. అందుకు భిన్నమైన సంకేతాలు వెళ్లినట్లు సొంత పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందనే భయం కాంగ్రెస్ పెద్దలకు పట్టుకుందని, అందుకే కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్నారని ప్రజలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. తమ పార్టీ పెద్దలు ఎవరికి వారే గేమ్ మొదలు పెట్టామనుకుని.. కేసీఆర్ ఆడిన గేమ్‌లో పావులయ్యారని కాంగ్రెస్ వర్గాలు వాపోతున్నాయి.