విజయవాడ టీడీపీ ఎంపీ సీటుపై నీలి మేఘాలు
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడ్ని ఆ పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇంఛార్జి కేశినేని శ్రీనివాస్ (నాని) ఆదివారం కలిశారు. విజయవాడ పార్లమెంట్ సీటును నానికి కాకుండా వేరే వారికి కేటాయిస్తారని ఊహాగానాల నేపథ్యంలో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబును కలిసిన నాని.. తనకు విజయవాడ పార్లమెంట్ సీటు కేటాయించాలని విన్నవించారు. కాగా, ఆ స్థానాన్ని నానికి ఇవ్వడానికి బాబు విముఖత వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ స్థానాన్ని ఓ పారిశ్రామికవేత్తకు కేటాయిస్తున్నట్లు నానికి బాబు తెలిపినట్టు ప్రాధమిక సమాచారం.
దీంతో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంపై నాని పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. విజయవాడ లోక్సభ సీటు ఇచ్చేది లేదని తేల్చిచెప్పడంతో కేశినేని హతాశులయ్యారు. విజయవాడ ఈస్ట్ లేదా పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయనకు పార్టీ కార్యాలయం నుంచి సమాచారం అందినట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నాని సుముఖంగా లేరని సమాచారం.
నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న తనకే ఎంపీ సీటు వస్తుందన్న దీమాతో ఉన్న నాని పార్టీ నిర్ణయంతో అవాక్కయ్యారు. సన్నిహితుల వద్ద ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. తనకు టిక్కెట్టు రాకపోవడంపై చంద్రబాబుతో మాట్లాడిన తర్వాతే స్పందిస్తానని నాని తెలపడంతో ఆయన తీసుకునే నిర్ణయంపై కార్యకర్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్‌రావులకు ఇప్పటికే చేయిచ్చిన చంద్రబాబు ఇప్పుడు కేశినేనికి షాక్ ఇస్తే గనుక టీడీపీలో మరో వివాదానికి దారి తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టికెట్లు ఇస్తానని తొలుత ఆశ చూపి.. బాబు తీసుకున్న ద్వంద్వ విధానం ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి చేటు చేసే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.