హైదరాబాద్: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. శనివారం సాయంత్రం కేశినేని చంద్రబాబును కలిసేందుకు సచివాలయం వెళ్లారు. కాగా బాబు కోసం ఆయన మూడు గంటలకుపైగా వేచియున్నారు. అనంతరం చంద్రబాబుతో కలసి కారులో ఆయన నివాసానికి వెళ్లారు. మంత్రి దేవినేని ఉమ వ్యవహారంపై చంద్రబాబు నివాసంలో చర్చించే అవకాశముంది.
కృష్ణా జిల్లాకే చెందిన మంత్రి దేవినేని ఉమాపై కేశినేని విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సంఘటన గురించి కేశినేని నాని చంద్రబాబుకు వివరణ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం నాడు కృష్ణాజిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమాపైన, రాష్ట్ర ప్రభుత్వ అధికారులపైన కేశినేని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఆరు నెలల కాలంలో విజయవాడకు ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్‌పై కూడా నాని ఘాటైన విమర్శలు గుప్పించారు. దీనిపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆయన ఎంపీ నానిని ఆదేశించారని సమాచారం.
చంద్రబాబుతో కేశినేని నాని భేటీ
Published Sat, Dec 27 2014 5:54 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement