- కేశినేనికి వ్యతిరేకంగా ముగ్గురు అభ్యర్థులు
- వారిని ఓడించడమే కేశినేని లక్ష్యం
- చంద్రబాబు వద్ద ‘పంచాయితీ’
- రెండు వర్గాలకూ బాబు వార్నింగ్
సాక్షి, విజయవాడ : టీడీపీలో ఇప్పటి వరకు అంతర్గతంగా సాగిన వర్గపోరు ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఒక వర్గంపై మరో వర్గం కత్తులు దూస్తోంది. ఎన్నికల వేళ కలిసి పనిచేయాల్సింది పోయి ఒకరి ఓటమికి మరోకరు వ్యూహాలు రచించుకుంటున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి ఆది,సోమవారాల్లో జిల్లాలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబువద్దకు చేరింది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఈ గొడవను చూసి చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అవ్వడంతో ఇరువర్గాలకు పూర్తిస్థాయిలో తలంటు పోశారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
కేశినేని వర్గంలో ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు.....
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్ధులు ఉన్నప్పటికీ ఒక సీటు అలయెన్సులో భాగంగా బీజేపీకి పోయింది. మిగిలిన ఆరుగురు అభ్యర్థులు రెండువర్గాలుగా చీలిపోయారు.కేశినేని నానికి అనుకూలంగా శ్రీరాం రాజగోపాల్(జగ్గయ్యపేట), తంగిరాల ప్రభాకర్(నందిగామ), నల్లగట్ల స్వామిదాస్(తిరువూరు) ఉండగా, దేవినేని ఉమామహేశ్వరరావు (మైలవరం), గద్దెరామ్మోహన్(విజయవాడ తూర్పు), బొండా ఉమమహేశ్వరరావు(విజయవాడ సెంట్రల్) ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
తనకు వ్యతిరేకంగా పనిచేసే ఎమ్మెల్యే అభ్యర్థులకు కేశినేని నాని డబ్బులు ఇవ్వడం బంద్ చేశారు. ఆయా నియోజకవర్గాల్లో తన ప్రైవేటు సిబ్బందితో డబ్బులు పంపిణీ చేస్తూ ఎంపీ ఓటు తమకు వేయమని, ఎమ్మెల్యే ఓటు మీ ఇష్టమైన వారికి వేయలంటూ ప్రచారం చేయిస్తున్నారనేఏ వార్తలొస్తున్నాయి.
చంద్రబాబు వద్ద పంచాయితీ?.....
తమకు వ్యతిరేకంగా కేశినేని నాని పనిచేస్తున్నారని స్పష్టమైన ఆధారాలు లభించడంతో దేవినేని ఉమా,బొండా ఉమా, గద్దెరామ్మోహన్ ఆదివారం ఉదయం నగరంలో ఉన్న చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టారు. స్వపక్షంలోనే విపక్షంలా కేశినేని నాని వ్యవహరిస్తున్నారని, తమకు డబ్బులు ఇవ్వకపోయినా తాను పనిచేస్తుంటే ఇప్పుడు తమను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.
సొంత సామాజిక వర్గం ముఖ్యులతోనే విభేదాలు పెంచుకున్న కేశినేని వల్ల తాము ఎంత కష్టపడినప్పటికీ ఓటమి పాలయ్యే పరిస్థితి దాపురించిందంటూ ఆవేదన వెళ్లగక్కారు. అయితే కేశినేని నాని వర్గం కూడా అంతేస్థాయిలో తిప్పికొట్టినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇరు వర్గాల కొట్లాట వల్ల జిల్లాలో పార్టీ నష్టపోతుందని ఆగ్రహించిన చంద్రబాబు కేశినేనినానితో పాటు ఇతర నేతలకు ఫోన్లలో తలంటు పోసినట్లు సమాచారం.
రంగంలోకి దిగిన సుజనా చౌదరి.....
కేశినేని నాని తమకు డబ్బు ఇవ్వడం లేదని, ఇప్పటికే పార్టీకి రూ.20 కోట్లు ఫండ్ ఇచ్చానని చెబుతున్నాడంటూ ఆయన వ్యతిరేకులు చంద్రబాబుకు చెప్పడంతో సమస్యను పరిష్కరించమంటూ పార్టీ పరిశీలకుడు సుజనా చౌదరిని ఆదేశించారు. సుజనా చౌదరి రంగంలోకి దిగి ఒకొక్క అభ్యర్థికి సోమవారం రూ.4 కోట్లు అందజేసినట్లు చెబుతున్నారు. కేశినేనినానికి వ్యతిరేకంగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను తన వైపు తిప్పుకుంటే భవిష్యత్తులో జిల్లాపై తన పట్టు మరింత పెరుగుతుందని భావించిన సుజనాచౌదరి వెంటనే వారికి ఆర్థిక సహాయం చేసినట్లు చెబుతున్నారు.