కిరణ్.. నిండా ముంచారు
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి... సీఎం పదవిని అడ్డుపెట్టుకుని సీమాంధ్ర పాలిట అక్షరాలా సైంధవ పాత్ర పోషించారు. విడదీసేందుకు వీల్లేదని పైకి మేకపోతు గాంభీర్యం ఒలకబోస్తూనే లోలోన విభజనకు కావాల్సిన రంగాన్నంతా సిద్ధం చేశారు. కేంద్రం ఆడించినట్టల్లా ఆడుతూ, విభజనకు కావాల్సిన సమాచారం దగ్గరి నుంచి అన్ని రకాల సాయమూ ఎప్పటికప్పుడు అం దించి సహకరించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు శల్య సారథ్యం వహించారు. వారి నుంచి అధిష్టానానికి ఎలాంటి ఇబ్బం దులూ తలెత్తకుండా కాపు కాశారు.
‘విభజన బిల్లు రాకముందే మేల్కొందాం. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ ముందుగానే అసెంబ్లీలో తీర్మానం చేద్దాం’’ అని సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతగా మొత్తుకున్నా కాకమ్మ కథలతో వారించారు. రాజీనామాలన్నా చేద్దామన్నా, ‘అసెంబ్లీలో సమైక్య గళాన్ని ఎవరు విన్పిస్తా’రంటూ దానికీ అడ్డుపడ్డారు. విభజనను ఆపేందుకు బ్రహ్మాస్త్రముంది లెమ్మంటూ బీరాలు పలికారు. చివరికి విభజన బిల్లుపై అసెంబ్లీలో సజావుగా చర్చ జరిగేలా, అది సభ అభిప్రాయంతో పాటుగా రాష్ట్రపతికి తిరిగి వెళ్లేలా దగ్గరుండి అన్ని జాగ్రత్తలూ తీసుకుని తరించారు.