
పోటెత్తిన పల్నాడు
జగనన్న వదిలిన బాణాన్ని చూసేందుకు పల్నాడు ప్రజలు పోటెత్తారు. జనభేరి రథం నుంచి ఆమె సంధిస్తున్న వాగ్భాణాలకు కేరింతలు కొట్టారు. రాజన్న తనయ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల బుధవారం సత్తెనపల్లి, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్ షోకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా గురజాల సభలో షర్మిల ప్రసంగం వింటున్న అశేష జనవాహినిలో ఒక భాగమిది.
అరండల్‌పేట(గుంటూరు), న్యూస్‌లైన్: జనభేరి ఎన్నికల ప్రచారానికి జిల్లాకు వచ్చిన ఆత్మీయ బంధువుకు అపూర్వ స్వాగతం లభించింది... అడుగడుగునా ప్రజాభిమానం వెల్లివిరిసింది.. మహానేత రాజన్న తనయ, జననేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలను చూసి జిల్లావాసులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ ఆడబిడ్డ వచ్చిందంటూ ఆనందంతో కేరింతలు కొట్టారు. రాజన్న రాజ్యం మళ్లీ తీసుకురావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని షర్మిల చెప్పగా అభిమానులు అందుకు అనుగుణంగా తమ స్వరాలను జతచేసి జై..జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
నరసరావుపేటలోని రామిరెడ్డి గెస్ట్‌హౌస్ నుంచి వైఎస్సార్ జనభేరి ప్రచార రథంపై బుధవారం షర్మిల రోడ్‌షో ప్రారంభించారు. నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు రోడ్‌షోలో పాల్గొన్నారు. రావిపాడు మీదగా శాంతినగరం, నకరికల్లు అడ్డరోడ్డుకు ప్రచార రథం చేరగానే పార్టీ సత్తెనపల్లి అభ్యర్థి అంబటి రాంబాబు అశేష జనవాహినితో ఎదురేగి షర్మిలకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నకరికల్లు మండలం చల్లగుండ్ల చేరుకోగానే అభిమానులు బైక్ ర్యాలీతో రోడ్‌షోను అనుసరించారు. పులివెందుల ఆడపడుచు షర్మిల నకరికల్లుకు వస్తోందన్న వార్త తెలుసుకున్న పలు గ్రామాల ప్రజానీకం ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. మండుటెండలోనూ రాజన్న బిడ్డ కోసం జాతీయ రహదారిపై బారులుతీరారు. నకరికల్లు కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ చంద్రబాబు వాగ్దానాలను నమ్మవద్దని, రామోజీ, చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఫ్యాను గుర్తుపై ఓటు వేసి పార్లమెంటు అభ్యర్థి అయోధ్యరామిరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి అంబటి రాంబాబులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. అనంతరం దేవరంపాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన బస కేంద్రానికి చేరుకున్నారు.
రాయవరం వద్ద అఖండ స్వాగతం..
భోజన విరామానంతరం పిడుగురాళ్ల చేరుకున్న ఆమెకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బ్రాహ్మణపల్లి, దాచేపల్లి, గురజాల, రెంటచింతల మీదగా రాయవరం అడ్డరోడ్డు వద్దకు రోడ్‌షో చేరుకోగానే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేలాది మంది కార్యకర్తలు, నాయకులతో ఎదురేగి స్వాగతం పలికారు. మాచర్ల, వెల్దుర్తి మీదుగా శిరిగిరిపాడుకు చేరుకున్న రాజన్న తనయపై అభిమానులు పూల జల్లులు కురిపించారు. అక్కడ బహిరంగ సభలో షర్మిల ప్రసంగానికి మంచి స్పందన లభించింది. అక్కడ లంబాడీ మహిళలు షర్మిలకు తమ సంప్రదాయ వస్త్రాలను అలంకరించి అభిమానాన్ని చాటుకున్నారు.
అక్కడి నుంచి మాచర్ల పట్టణం చేరిన ప్రచార రథం జమ్మలమడక గ్రామం మీదగా తుమృకోట, పాల్వాయి మీదగా రెంటచింతల చేరుకుంది. అక్కడి నుంచి నేరుగా గురజాలకు చేరుకున్న షర్మిలకు స్థానిక అసెంబ్లీ అభ్యర్థి జంగా కృష్ణమూర్తి తమ కార్యకర్తలు, నాయకులతో ఎదురేగి ఘనస్వాగతం పలికారు. అక్కడి బ్రహ్మనాయుడు విగ్రహం సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు షర్మిల చేరుకొనే సరికి రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. ఓటువేసే సమయంలో ఒక్కసారి మహానేత రాజశేఖరరెడ్డిని గుర్తుకు తెచ్చుకోవాలని ఆమె ప్రజలను కోరారు. అక్కడి నుంచి దాచేపల్లిలో రాత్రి బసకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి, పార్టీ ఎస్టీ విభాగం జిల్లా కన్వీనర్ హనుమంత్‌నాయక్, దర్శనపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.