కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా, మండల పరిషత్ సమరంలో గురువారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మూడు రోజుల్లో 52 జెడ్పీటీసీ స్థానాలు 149, 636 ఎంపీటీసీ స్థానాలకు 1,329 నామినేషన్లు వచ్చాయి. ఇక చివరి రోజు జెడ్పీటీసీలకు 440, ఎంపీటీసీ స్థానాలకు 3,359 వచ్చాయి. మొత్తం జెడ్పీటీసీలకు 589, ఎంపీటీసీలకు 4,688 పోటీ పడుతున్నారు. బరిలో ఉండే అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్ వేయడంతో ఈసారి పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
నేడు నామినేషన్ల పరిశీలన
జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు సంబంధించిన నామినేషన్ల పత్రాలను శుక్రవారం పరిశీలించనున్నారు. జెడ్పీటీసీ నామినేషన్లు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి రిటర్నింగ్ అధికారి జనార్దన్ నివాస్, సహాయ రిటర్నింగ్ అధికారులు జెడ్పీ సీఈవో అనితాగ్రేస్, పంచాయతీరాజ్ శాఖ ఎస్‌ఈ ఉమామహేశ్వర్‌రావుతోపాటు మరో ఐదుగురు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నామినేషన్ పత్రాలు పరిశీలించనున్నారు. ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్లను మండల పరిషత్ కార్యాలయంలో ఆయా మండలాల రిటర్నింగ్ అధికారులతోపాటు ఇద్దరు సహాయ రిటర్నింగ్ అధికారులు పత్రాలు పరిశీలిస్తారు.
ఈ నెల 23న తిరస్కరణ, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ, ఈనెల 24న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. సాయంత్రం 3 గంటల అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. అనంతరం బరిలో నిలిచే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. కాగా, మరో పదహారు రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 8న ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అనంతరం అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. అనంతరం కొత్త పాలక వర్గం ఏర్పడుతుంది.
వ్యూహ రచనలో పార్టీలు
జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఇక పార్టీలు వ్యూహ రచనలో పడ్డాయి. పార్టీల టిక్కెట్ దొరకని అభ్యర్థులు రెబెల్‌గానైనా పోటీలో ఉంటామని ప్రకటిస్తున్నారు. ఇదీ కొందరు అభ్యర్థులకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. వీరిని ఉపసంహరించుకోవాలని బుజ్జగిస్తున్నారు. పార్టీల్లోని ముఖ్యనాయకులతో చెప్పిస్తున్నారు. వారికి తాయిలాలు ఇస్తామని బరిలో ఉండే అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. దీంతో ఎంత మేరకు సఫలం అవుతారో వేచిచూడాలి.
కొందరు నాయకులు జిల్లా పరిషత్ స్థానాల్లో సగం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు నాయకులు జెడ్పీటీసీ స్థానాలను 30 వరకు దక్కించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు, ప్రత్యేక అధికారుల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందుకు వెళ్లి వివరించేందుకు వివిధ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అదే తరుణంలో జిల్లా పరిషత్ పోరులో సగం సీట్లు మహిళలకు కేటాయించడంతో తల్లులు, భార్యలను బరిలోకి దింపారు. దాఖలైన నామినేషన్లను బట్టి చూస్తే ఒక జిల్లా పరిషత్ స్థానానికి త్రిముఖ పోరు కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
నామినేషన్ పత్రం ముట్టింది
Published Fri, Mar 21 2014 3:00 AM | Last Updated on Tue, Oct 2 2018 2:53 PM
Advertisement
Advertisement