‘స్థానిక’ కౌంట్‌డౌన్
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: అన్ని రకాల ఎన్నికలూ ముగిశాయి. ఇక తేలాల్సింది గెలుపోటములే. ఇటు పార్టీలు.. అటు అధికార యంత్రాంగం ఇప్పుడు వాటిపైనే దృష్టి సారించాయి. సార్వత్రిక ఫలితాలకు ముందే స్థానిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానుండటంతో పార్టీలు ఇప్పుడు ఆ లెక్కలతో కుస్తీ పడుతున్నాయి. ఈ ఏడాది మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు, ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
ఎన్నికలు జరిగిన పలాస, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పాలకొండ మున్సిపాలిటీల కౌంటింగ్ ఈ నెల 12న చేపట్టనున్నారు. అలాగే ఎన్నికలు జరిగిన 37 జెడ్పీటీసీలు, 675 ఎంపీటీసీల స్థానాల కౌంటింగ్ 13న నిర్వహిస్తారు. వాస్తవానికి పోలింగ్ జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే వీటి లెక్కింపు పూర్తి కావాల్సి ఉన్న సార్వత్రిక ఎన్నికలపై ఆ ఫలితాల ప్రభావం ఉంటుందన్న ఉద్దేశంతో సార్వత్రిక పోలింగ్ ముగిసిన తర్వాతే స్థానిక ఎన్నికల కౌంటింగ్ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించడంతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరో 72 గంటల వ్యవధిలోనే మొదట మున్సిపల్.. ఆ మరుసటి రోజే ప్రాదేశిక ఫలితాలు వెల్లడికానుండటంతో అభ్యర్ధుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ పూర్తయిన తొలి రోజుల్లో వీరు ఉత్కంఠకు గురైనా.. కోర్టు తీర్పుతో లెక్కింపు వాయిదా పడటం, సార్వత్రిక ఎన్నికలు బిజీలో పడి ఆ విషయం మరిచిపోయారు. తమ ఫలితం తేలే సమయం ఆసన్నం కావడంతో ప్రాంతాలవారీగా పోలైన ఓట్ల లెక్కలతో గెలుపు అవకాశాలను అంచనా వేయడం ప్రారంభించారు.
సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ సరళి.. స్థానిక ఎన్నికల నాటి పరిస్థితిని బేరీజు వేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. గతంలో ఏ ఎన్నికలు జరిగినా పందాలు జోరుగా సాగేవి. ఈసారి మున్సిపల్, జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై పందాలే జరగక పోవడం విశేషం. సాధారణ ఎన్నికలపై పందాలు జోరు రోజురోజుకూ పెరుగుతుండగా స్థానిక సంస్థల ఎన్నికలపై మాత్రం పందాలు జరగడం లేదు. ఓట్ల లెక్కింపు ముందు రోజు నుంచి పందాలు జోరుగా సాగవచ్చని పలువురు చెబుతున్నారు.