సాక్షి, హన్మకొండ: తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నాడో సినీ కవి. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందు రోజే రాజకీయ నేతలు తమ పార్టీ తరఫున వార్డు కౌన్సిలర్లుగా బరిలో నిలి చిన అభ్యర్థులను రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నారు. గెలిచిన వారు ఎట్టి పరిస్థితుల్లోను తమ పట్టు నుంచి జారిపోకుండా... ఇతర పార్టీల్లో చేరకుండా ఉండేందుకు ప్రధాన పార్టీల నేతలు క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు. జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు... పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నగర పంచాయతీలకు ఈ ఏడాది మార్చి 30న పోలింగ్ జరిగింది.
మొత్తం 115 మంది వార్డులకు 651 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈసారి చైర్‌పర్సన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా పరోక్ష పద్ధతిలో జరగనుంది. ఈ మేరకు ప్రతి మునిసిపాలిటీలో ఎక్కువ వార్డుల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు, తమలో ఒకరిని మునిసిపాలిటీ చైర్మన్‌గా, మరొకరిని వైస్‌చైర్మన్‌గా ఎ న్నుకుంటారు. దీంతో గెలిచిన ప్రతి వార్డు మెంబరూ కీలకం గా మారారు. ఈ నేపథ్యంలో ఐదు మునిసిపాలిటీలకు సం బంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న నిట్ క్యాంపస్ కేంద్రంగా క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి.
ఒక రోజు ముందుగానే...
భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్‌లో చైర్‌పర్సన్ సీటుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. భూపాలపల్లిలో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు జతకట్టగా... మహబూబాబాద్‌లో టీఆర్‌ఎస్ సీపీఐలు ఒక జట్టుగా ఎన్నికల బరిలో నిలిచాయి. భూపాలపల్లి నుంచి వార్డు మెంబర్లుగా బరిలో నిలిచిన అభ్యర్థులను ఒకరోజు ముందుగానే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు హన్మకొండలోని రహస్య ప్రదేశాలకు తరలించారు. సోమవారం ఫలితాలు వెలువడిన తర్వాత గెలిచిన అభ్యర్థులను అక్కడి నుంచి అటే పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లే యోచనలో నాయకులు ఉన్నారు. కాగా.. మహబూబాబాద్ టీఆర్‌ఎస్ వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు ఒక బృందంగా ఏర్పడి ఆదివారం రాత్రి మహబూబాబాద్ నుంచి హన్మకొండకు చేరుకున్నారు.
వీరందరూ కౌంటింగ్ కేంద్రానికి దగ్గరల్లో ఉన్న లాడ్జిలో బస చేసినట్లుగా సమాచారం. మరోవైపు భూపాలపల్లిలో టీఆర్ ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన వార్డు మెంబర్లు సోమవారం తెల్లవారు జామున మొలుగూరి బిక్షపతి ఇంటికి చేరుకుని... అక్కడి నుంచి ప్రత్యేక వాహానంలో హన్మకొండకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. పరకాలలో టీడీపీ, బీజేపీ గణనీయమైన సంఖ్యలో వార్డుమెంబర్లుగా గెలుస్తామని అంచనా వేస్తున్నాయి. రెండు పార్టీలు ఒక జట్టుగా ఏర్పడి చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎంపికలో కీలక పాత్ర పోషించాలనే నిర్ణయానికి వచ్చాయి. ఈ క్రమంలో ఈ రెండు పార్టీల నుంచి గెలిచిన వార్డు మెంబర్లు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా కట్టడి చేయడంపై స్థానిక నాయకత్వం దృష్టి పెట్టింది. ఇదిలా ఉండగా... జనగామ, నర్సంపేట మునిసిపాలిటీల్లో ఫలితాలు వెలువడిన తర్వాత రంగంలోకి దూకాలని అక్కడి నేతలు భావిస్తున్నారు.
మొదలైన క్యాంపులు
Published Mon, May 12 2014 1:51 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement