కొనసాగుతున్న రెండో విడత పోలింగ్
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలలో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. మలి దశలో భాగంగా 4 ఈశాన్య రాష్ట్రాల్లోని 6 లోక్‌సభ స్థానాలకు, అరుణాచల్‌ప్రదేశ్‌లోని 49 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరుగుతోంది. అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయల్లో రెండేసి సీట్లకు, నాగాలాండ్, మణిపూర్‌లలో ఒక్కో ఎంపీ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది.
కాగా మిజోరంలోని ఏకైక లోక్‌సభ స్థానానికీ ఇవాళే ఎన్నికలు జరగాల్సి ఉన్నా మిజో విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునివ్వడంతో పోలింగ్‌ను 11వ తేదీకి వాయిదా వేశారు. నాగాలాండ్‌లోని ఏకైక లోక్‌సభ స్థానానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నేప్యూ రియో సహా ముగ్గురు అభ్యర్థులు పోటీపడుతున్నారు.
మణిపూర్‌లోని ఔటర్ మణిపూర్ సీటుకు పది మంది, మేఘాలయలోని 2 లోక్‌సభ స్థానాల్లో లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా సహా పలువురు పోటీలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని 2 సీట్లకు కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, పీపీఏల మధ్య పోరు నెలకొంది. కాగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.