ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రచారానికి కేవలం మూడు రోజులు మాత్రమే ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉదయం 6గంటలకే బయలుదేరి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రచారంలోనే టీ, టిఫిన్, భోజనాలు చేస్తూ రాత్రి పది గంటల వరకు కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిన అంశాలపై అనుచరులతో సమాలోచనలు సాగిస్తున్నారు. మరికొంత మంది అభ్యర్థులు కంటిమీద కునుకు లేకుండా ఓట్ల కోసం నానా తంటాలు పడుతున్నారు.
మరికొంత మంది అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. భార్య, కుమారుడు, కుమార్తె, కోడలు, ఇలా ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. మాజీ అభ్యర్థులు తాము గతంలో చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ ముందుకు సాగుతుండగా, మరి కొంత మంది తాము గెలిస్తే ఏ అభివృద్ధి పనులు చేస్తామో వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. మరి కొందరు తమ నేతలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ...తాము గెలిచి..తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేసే పనులను వివరిస్తున్నారు. ఏది ఏమైనా అభ్యర్థులు మాత్రం గెలుపే లక్ష్యంగా ప్రచారం చేసుకుంటూ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
గెలుపుకోసం అడ్డదారులు....
పలు పార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా అడ్డదారులు తొక్కుతున్నారు. మద్యం, డబ్బులను విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. యువతను ఆకర్షించేందుకు క్రికెట్ కిట్లు పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రత్యర్థుల ఓటమే లక్ష్యంగా గ్రామాల్లో ఉన్న నాయకులను సమన్వయం చేసుకుని వారికే ఈ ‘పంపిణీ’ బాధ్యతలు అప్పగిస్తున్నారు. తీవ్ర పోటీ ఉన్న చోట ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భారీస్థాయిలో తాయిలాలు అందించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మరోపక్క ద్వితీయ శ్రేణి నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు పెద్ద మొత్తంలో డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నారు.
గ్రామాల్లో రాజకీయ సందడి..
నిన్నటి వరకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిన గ్రామాల్లో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీల జిల్లా స్థాయి నేతలు గ్రామాల్లో మకాం వేసి ద్వితీయ శ్రేణి నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు, ఓడిన అభ్యర్థులను కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రెబల్ అభ్యర్థులపైన దృష్టిసారిస్తున్నారు. వారిని ప్రలోభాలకు గురి చేసి తమ వైపు తిప్పుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తే దానికి తగిన ప్రతిఫలం వచ్చేలా చూస్తామని చెబుతున్నారు.. తమ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాల్లో కాంట్రాక్టులు ఇస్తామని, తమ పార్టీ అండగా ఉంటుందని, ఏ అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదించండి అంటు మాయమాటాలు చెబుతున్నారు.
ముఖ్యనేతల ప్రచారంలో కేడర్‌లో ఉత్సాహం..
అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తుంటే వారి తరఫున ఆయా పార్టీల రాష్ట్రస్థాయి నేతలు కూడా జిల్లాలో పర్యటించి ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఒకసారి ఖమ్మంలో ‘జయభేరి’ మోగించగా.. మరోసారి ఎన్నికల ప్రచారం నిమిత్తం శనివారం జిల్లాకు వస్తున్నారు. అలాగే పార్టీ నాయకురాలు షర్మిల నాలుగురోజుల ఎన్నికల ప్రచార యాత్ర విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.
నేతల పర్యటనలు విజయవంతం కావడంతో ఆ పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహంతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. తమ గెలుపునకు ఢోకాలేదని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కరోజులోనే ఖమ్మం, ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్తగూడెం, భద్రాచలం, మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇక కాంగ్రెస్ తరుఫున కేంద్రమంత్రి జైరాంరమేష్, సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, సీపీఐ తరపున సురవరం సుధాకర్‌రెడ్డిలు ప్రచారం నిర్వహించారు.
సార్వత్రిక జోరు
Published Sat, Apr 26 2014 4:00 AM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM
Advertisement
Advertisement