జహీరాబాద్, న్యూస్‌లైన్: స్థానిక మున్సిపాలిటీపై మజ్లిస్ పార్టీ గురిపెట్టింది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుపొంది చైర్మన్ పదవి విషయంలో కీలకంగా మారాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పట్టణంలో మొత్తం 24 వార్డులకు గా ను 11 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న వార్డులపైనే ఆ పార్టీ నేతలు దృష్టిసారించారు. చైర్మన్ పదవికి ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగిన సమయంలో మజ్లిస్ కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చింది. ప్రతి ఎన్నికల్లోనూ చైర్మన్ పదవిని స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోతూ వచ్చింది. చైర్మన్ పదవికి పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తుండడంతో మజ్లిస్‌కు కలిసి రావడం లేదు.
గతంలో కౌన్సిల్‌లో ఆరుగురు కౌన్సిలర్లను గెలుపొందిన చరిత్ర మజ్లిస్‌కు ఉంది. ఈ ఎన్నికల్లో అప్పటి రికార్డులను బద్దలు కొట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం పార్టీ తరఫున 3వ, 6, 8, 9, 12, 17, 19, 20, 21, 22, 23వ వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. పార్టీ ఇన్‌చార్జి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎండీ లుక్మాన్ 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన పోటీ చేసిన వార్డు మహిళలకు రిజర్వు కావడంతో ఈ వార్డు నుంచి బరిలో నిలిచారు. ఈ పార్టీ అభ్యర్థులు దాదాపుగా అన్ని వా ర్డుల్లోనూ గట్టి పోటీ ఇవ్వనున్నారు. 12వ వార్డు ఎస్టీలకు, 19 వ వార్డు ఎస్సీలకు రిజర్వు కావడంతో ఆయా వార్డుల్లో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉండడంతో అక్కడ కూడా అభ్యర్థులను పోటీకి దింపారు. మజ్లిస్ రంగ ప్రవేశం కా ంగ్రెస్, టీడీపీ నేతలకు గుబులు పుట్టిస్తోంది. మజ్లిస్ బలపడకుండా ఉండేందుకు గాను కాంగ్రెస్ నేతలు తమ వంతు వ్యూహరచన చేస్తున్నారు.
అసదుద్దీన్ పర్యటనతో శ్రేణుల్లో ఉత్సాహం..
మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గత ఆదివారం జహీరాబాద్ మున్సిపాలిటీలో పర్యటించా రు. ఆయన రెండు వార్డుల్లో పర్యటించి బహిరంగ సభలో ప్రసంగించారు. మజ్లిస్ గెలుపుతోనే ముస్లిం మైనార్టీల ప్రగతి ముడిపడి ఉందని ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. మజ్లిస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సహకరించాలని ఆయన కోరారు. అధినేత పర్యటనతో పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులు మరింత ఉత్సాహంగా కదులుతున్నారు. ఒవైసీ పర్యటన దరిమిలా ఆ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.
జహీరాబాద్‌పై ‘మజ్లిస్’ గురి
Published Tue, Mar 25 2014 11:22 PM | Last Updated on Mon, Oct 8 2018 8:39 PM
Advertisement