
ఢిల్లీలో నేనుంటే.. మోడీ జైలుకే!
మమతా బెనర్జీ మండిపాటు
ఎన్నికల తరువాత బెంగాల్ ప్రజలే ఆయన్ను తరిమేస్తారు
నమో అంటే కాంగ్రెస్‌కు వణుకు
బరంపూర్ (పశ్చిమ బెంగాల్): తానే హస్తినలో ఉంటే నరేంద్రమోడీని జైలుకు పంపేదాన్నని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే మే 16 తరువాత అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను కట్టగట్టి దేశం నుంచి వెళ్లగొడతామంటూ మోడీ పేర్కొనటంపై ఆమె తీ వ్రంగా ప్రతిస్పందించారు. వారంతా దీర్ఘకాలంగా నివసిస్తున్న పౌరులని చెప్పారు. మోడీ పేరు చెబితే కాంగ్రెస్ వెన్ను లో వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. ‘వారికి (కాంగ్రెస్) ధైర్యం లేదు. అది భయం గూడుకట్టుకున్న పార్టీ. సర్దుబా ట్లు, మ్యాచ్ ఫిక్సింగ్‌లతో ఆ పార్టీ నెట్టుకొస్తోంది. మోడీతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది’ అని మమత వ్యాఖ్యానించారు. శుక్రవారం ముర్షీదాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ స్థానంలో ఢిల్లీలో తాను అధికారంలో ఉంటే నరేంద్రమోడీ నడుముకు తాడు కట్టి జైలుకు పంపేదాన్నని వ్యాఖ్యానించారు. మోడీ అప్పుడే ప్రధాని అయినట్లు భ్రమలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ‘మైనార్టీ సోదర సోదరీమణులారా.. మే16 తరువాత మిమ్మల్ని వెళ్లగొడతారట. మీరిది విన్నారా..?’ అని మమత ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల తరువాత బెంగాల్ ప్రజలు ఆయన్నే తరిమేస్తారని, సామాన్లు సర్దుకుని సిద్ధంగా ఉండాలని సూచించారు.
మోడీ ప్రధాని కావటం అసాధ్యం: కాంగ్రెస్
మోడీ ప్రధాని కావటం అసాధ్యమని కాంగ్రెస్ పేర్కొంది. ‘బీజేపీ లేదా ఎన్డీయేకు మద్దతిచ్చే పార్టీలు లేవు. ప్రతి పార్టీ బీజేపీ, మోడీ నుంచి దూరంగా జరుగుతున్నాయి. తగినంత బలం లేకుండా మోడీ ప్రధాని కాలేరని, బీజేపీ అధికారంలోకి రాదని మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం వారికి లభించదు’ అని కాంగ్రెస్ పేర్కొంది.