సీఎం సీటుకు పోటాపోటీ!
* ఆశావహులందరికీ టీ-కాంగ్రెస్ జాబితాలో చోటు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన తెలంగాణ అభ్యర్థుల జాబితాలో ఆ ప్రాంత ముఖ్యులందరికీ చోటు దక్కింది. ప్రధానంగా టీ-కాంగ్రెస్‌లో సీఎం సీటును ఆశిస్తున్న నేతలందరూ బరిలో నిలిచారు. ఇప్పటికే పార్టీ పదవుల్లో ఉన్నవారందరికీ కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. అభ్యర్థుల విషయంలో సుదీర్ఘ కసరత్తు చేసిన హైకమాండ్.. ఒకేసారి 111 స్థానాలకు పోటీదారుల పేర్లను ప్రకటించి ఇకపై మార్పుచేర్పుల కసరత్తుల్లేకుండా చూసుకుంది.
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ అధ్యక్షుడు దామోదర రాజనర్సింహలకు సహజంగానే జాబితాలో చోటు దక్కగా... టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన కె.జానారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌లకూ టికెట్లిచ్చారు. వీరంతా సీఎం రేసులో ఉన్న వారే కావడం గమనార్హం. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీకీ టికెట్లు ఖరారయ్యాయి.
సోనియా విధేయుడిగా వీహెచ్, మైనారిటీ కోణంలో షబ్బీర్‌అలీ కూడా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డిలు కూడా సీఎం ఆశావహుల జాబితాలో ఉన్నవారే. ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ అధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబులు సరేసరి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తే.. అప్పుడు మొదలవుతుంది అసలు కథ!.