సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చేరికలు, పొత్తులు తెలుగుదేశం పార్టీ బలాన్ని పెంచకపోగా కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. పార్టీ నేతలను అభద్రతభావంలోకి నెట్టేస్తున్నాయి. కొండంత ఆశతో పార్టీ మారి పెందుర్తి నుంచి విశాఖ ఉత్తర నియోజక వర్గంలో పని ప్రారంభించిన శాసన సభ్యుడు పంచకర్ల రమేష్‌బాబుకు బీజేపీ పొత్తు అంశం శాపంగా మారింది.
ఇంకో వైపు తన సామాజిక వర్గం నేతలు పెద్ద ఎత్తున సీట్లు ఆశిస్తుండడం, తనపై అవినీతి ఆరోపణలు రావడం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అభ్యర్థిత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. పొత్తు కుదిరితే తాము విశాఖ లోక్‌సభతో పాటు విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజక వర్గాన్ని కోరాలని బీజేపీ నేతలు నిర్ణయించడం ఇప్పుడు తెలుగుదేశం నేతలను కలవరపరుస్తోంది. ఇప్పటికే ఉత్తర నియోజక వర్గ తెలుగుదేశం వార్డు నేతలతో సమావేశమై అన్ని ఏర్పాట్లు చేసుకున్న రమేష్‌బాబును బీజేపీతో పొత్తు వ్యవహారం పూర్తిగా అయోమయంలో పడేసింది.
మాజీ మంత్రి గంటా బృందంలో ఇప్పటికే చింతలపూడి వెంకట్రామయ్య, యూవీ రమణమూర్తి రాజులకు టికెట్లు దాదాపుగా గల్లంతుకాగా, ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదిరితే రమేష్‌బాబు కూడా వారి సరసన చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ దక్షిణం కంటే ఉత్తర నియోజక వర్గమే తమకు బాగుంటుందని బీజేపీలోని క్షత్రియ నేతలు భావిస్తున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజుతో పాటు గతంలో దక్షిణం నుంచి పోటీచేసిన కాశీ విశ్వనాథరాజు, పి.మాధవ్ తదితరులు ఈ సీటు కోసం పోటీపడుతున్నారు.
ఇక తన సామాజిక వర్గానికే చెందిన షిరీన్ రెహమాన్, అనిత సకురు తదితరులు టికెట్ రేసులో ముందుండడం వెలగపూడి రామకృష్ణబాబు అవకాశాలను దెబ్బతీస్తోంది. వీరితో పాటు కొత్తగా మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్.మూర్తి కూడా ఈ పర్యాయం తనకు విశాఖ పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ సీటు కేటాయించాలని కోరడం వెలగపూడికి పెద్దషాకే ఇచ్చింది.
పొత్తు కుదిరితే బీజేపీ విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా ఇదే సామాజిక వర్గానికి చెందిన కంభంపాటి హరిబాబు పోటీ చేయనున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అనిత, షిరీన్, ఎం.వి.వి.ఎస్.మూర్తిలలో ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా వెలగపూడికి అవకాశం లేనట్టే. వె లగపూడి వ్యవహారశైలిపై చంద్రబాబు కాస్త ఆగ్రహంతో ఉండడం కూడా ఆయన అవకాశాలను దె బ్బతీస్తున్నాయి. మద్యం ఎంఆర్‌పీ ధరల కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొవడంతోపాటు, వేయి కోట్ల రూపాయల వుడా భూముల కుంభకోణంలో కూడా వెలగపూడి పాత్ర ఉండడంపై ఇప్పటికే చంద్రబాబుకు ఫిర్యాదులు వెళ్లాయి.
తాము బెల్ట్‌షాపులకు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెబుతూ మరో పక్క వెలగపూడికి టికెట్ ఎలా ఇస్తారని సీనియర్ నేతలు కొందరు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలిసింది. ఇక ఇటీవల పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిన అయ్యన్న-గంటాల వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పి నర్సీపట్నం వెళ్లిన వెలగపూడి ఆ సమస్యను మరింత పెంచారని చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. దీంతో తెలుగుదేశం టికెట్ వచ్చే వరకూ ధీమాగా ఉండలేని అయోమయంలో పంచకర్ల, వెలగపూడిలు పడిపోయారు.
దేశంలో కుర్చీలాట
Published Fri, Mar 21 2014 1:11 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM
Advertisement
Advertisement