అమీ తుమీ | assembly, parliament elections | Sakshi
Sakshi News home page

అమీ తుమీ

Published Sat, Apr 5 2014 1:58 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

అమీ తుమీ - Sakshi

అమీ తుమీ

 సాక్షి ప్రతినిధి, అనంతపురం : తెలుగుదేశం పార్టీలో తన చేరికను వ్యతిరేకించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు చెక్ పెట్టేందుకు ఆ పార్టీ నేత జేసీ దివాకర్‌రెడ్డి ఎత్తులు వేస్తున్నారా? పరిటాల సునీతను వ్యతిరేకిస్తోన్న వారందరినీ చేరదీస్తున్నారా? టీడీపీలో పరిటాల సునీతను సమర్థిస్తోన్న ఏకైక ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ సీటును బీజేపీకి ఇచ్చేలా ఆపార్టీ అధిష్టానాన్ని జేసీనే ప్రభావితం చేస్తున్నారా? ఈప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు.



 వివరాల్లోకి వెళితే.. పరిటాల రవి, జేసీ దివాకర్‌రెడ్డిలు రాజకీయాల్లో ఉప్పూనిప్పుగా ఉన్న విషయం విదితమే. జేసీ దివాకర్‌రెడ్డితో రాజకీయంగా పరిటాల రవి తీవ్రంగా విభేదించారు. ఈ క్రమంలోనే జనవరి 24, 2005న పరిటాల రవి అనంతపురంలో ప్రత్యర్థుల చేతిలో హతమయ్యారు. ఆ హత్య కేసులో జేసీ దివాకర్‌రెడ్డి కూడా నిందితుడని పరిటాల సునీత అప్పట్లో ఆరోపించారు. 2009 ఎన్నికల్లో రాప్తాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పరిటాల సునీత.. ప్రొటెం స్పీకర్‌గా ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి ఎదుట ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా ఆసక్తి చూపలేదంటే ఆయనపై ఆమెకు ఉన్న వ్యతిరేకత ఏ స్థాయో విశదం చేసుకోవచ్చు. ఇప్పటికీ జేసీని అదే స్థాయిలో ఆమె వ్యతిరేకిస్తున్నారు.


 
ఆ క్రమంలోనే జేసీ బ్రదర్స్‌ను టీడీపీలో చేర్చుకోవద్దని చంద్రబాబును పదే పదే డిమాండ్ చేశారు. ‘బేర’సారాలు కుదరడంతో.. పరిటాల సునీత అభ్యంతరాలను చంద్రబాబు లెక్కచేయలేదు. జేసీ బ్రదర్స్‌కు రెడ్‌కార్పెట్ వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. టీడీపీలోకి జేసీ ప్రవేశించిన తర్వాత పరిటాల సునీత పలు సందర్భాల్లో మాట్లాడుతూ జేసీతో కలిసి పనిచేసే ప్రశ్నే లేదని స్పష్టీకరించారు. కానీ.. పరిటాల సునీత తన సోదరి అని జేసీ పైకి చెబుతూ వస్తున్నారు. అయితే అంతర్గతంగా మాత్రం తనను వ్యతిరేకించిన పరిటాల సునీతను రాజకీయంగా దెబ్బతీసేందుకు జేసీ దివాకర్‌రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.


రాప్తాడు నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పరిటాల సునీత పెనుకొండ నియోజకవర్గంపై కన్నేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరారు. ఇందుకు చంద్రబాబు అంగీకరించలేదు. కానీ.. ఆమె తన ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. ఈ క్రమంలోనే పరిటాల సునీతకు పెనుకొండ సీటు దక్కకుండా చేసేందుకు జేసీ దివాకర్‌రెడ్డి ప్రణాళిక రచించారు. పరిటాల సునీతను వ్యతిరేకిస్తోన్న నేతలను దగ్గరికి తీసేయత్నంలో భాగంగానే గురువారం పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలంలో ఎంపీ నిమ్మల, ఎమ్మెల్యే బీకేతో కలిసి పర్యటించారు. పెనుకొండ టికెట్ బీకే పార్థసారధికే వస్తుందని జేసీ దివాకర్‌రెడ్డి టీడీపీ శ్రేణులతో స్పష్టీకరించారు.


ఇది పరిటాల సునీత వర్గీయులను ఆగ్రహానికి గురిచేసింది. పరిటాల  సునీతకు చెక్‌పెట్టే క్రమంలోనే ఆమె వర్గీయుడైన కందికుంట ప్రసాద్ సీటుకు టీడీపీ అధిష్టానం ఎసరు పెట్టడంలో జేసీ ప్రధాన భూమిక పోషిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  కదిరి సీటు కోసం బీజేపీ తీవ్రంగా పట్టుబడుతోన్న నేపథ్యంలో ఆ సీటు ఇవ్వడమే మంచిదని సీఎం రమేష్ ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు.



జిల్లాలో ఆ ఒక్క సీటు ఇచ్చినా బీజేపీ సర్దుకుంటుందని చంద్రబాబుకు జేసీ దివాకర్‌రెడ్డి చెప్పడంతో ఆ మేరకు కదిరిని వదులుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. కదిరి శాసనసభ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తోన్న నేపథ్యంలో.. ఎమ్మెల్సీ ఇస్తామని కందికుంట ప్రసాద్ వద్దకు సీఎం రమేష్‌ను చంద్రబాబు రాయబారం పంపడం అందులో భాగమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement