మోడీకి హిందూ, ముస్లిం మత పెద్దల మొట్టికాయలు
ఏ క్షణాన వారణాసి నుంచి పోటీ చేయాలని నరేంద్ర మోడీ ఎంచుకున్నారో కానీ ఆయనకు అన్నీ ఇబ్బందులే. కరడుగట్టిన హిందుత్వ వాదిగా పేరొందిన మోడీకి వ్యతిరేకంగా కాషాయధారి సన్యాసులు, స్వాములు, జగద్గురువులు ఒక వైపు నడుం బిగిస్తూంటే, మరో వైపు ముస్లిం ధార్మిక గురువు మౌలానా మెహదీ హసన్ బాబా కూడా మోడీ ని ఎండగట్టే ప్రచారం చేయడానికి సిద్ధం అవుతున్నారు.
మౌలానా మెహదీ హసన్ బాబా ఎవరంటే 2011 లో తొలిసారి మోడీ ముస్లింలకు చేరువ అయ్యేందుకు సద్భావనా దీక్ష జరిపారు. ఈ దీక్షలో మోడీకి ముస్లింలు ధరించే టోపీ పెట్టేందుకు ఒక మత గురువు ప్రయత్నించారు. మోడీ ఆ టోపీని నిర్మొగమాటంగా తిరస్కరించారు. ఆ మతగురువే మెహదీ హసన్ బాబా.
ఆయన శుక్రవారం నుంచి మే 12 దాకా వారణాసిలో ప్రచారం చేస్తున్నారు. 'ముఝే చందా నహీ బందా చాహియే' (నాకు చందా వద్దు, పనిచేసే కార్యకర్తలు కావాలి) అన్న నినాదంతో ఆయన తనతో పాటు పనిచేసే యువకులను ఆహ్వానిస్తున్నారు. తన ఉద్యమానికి 'భారత్ బచావో, దేశ్ బచావో' అని ఆయన పేరు పెట్టారు.
వారణాసిలో ముస్లిం ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. మెహదీ హసన్ బాబా ప్రభావం వారిపై ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటు హిందు, ఇటు ముస్లిం మత పెద్దలు మోడీపై ఫైర్ కావడం మోడీకి ఇబ్బందికరంగా మారింది.