మోడీ ప్రధాని అయితే దేశానికే ప్రమాదం: మాయావతి
హైదరాబాద్ : బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశానికే ప్రమాదమని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. మోడీ హయాంలోనే గుజరాత్‌లో నరమేధం జరిగిందని, అలాంటి వ్యక్తి దేశానికి ప్రధాని కావడం ప్రమాదకరమన్నారు. హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో సోమవారం బీఎస్పీ ఎన్నికల ప్రచార సభలో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రధాని అయితే దేశ ఆర్థిక వ్యవస్థను మారుస్తానని మోడీ అంటున్నారని, బీజేపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో గుర్తు చేసుకోవాలన్నారు.
కాంగ్రెస్ రాజకీయం రాహుల్ గాంధీ, ప్రియాంక చుట్టూ, బీజేపీ రాజకీయం మోడీ చుట్టూనే తిరుగుతోందని, వ్యక్తులపై ఆధారపడిన రాజకీయాలు హానికరమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో నక్సలిజం ప్రధాన సమస్యగా మారనుందని, తాము అధికారంలోకి వస్తే దానితోపాటు వివిధ సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. వెనుకబడిన వర్గాలకు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కొన్ని ప్రాంతాల్లో తమ పార్టీకి ఉన్న 4 శాతం ఓట్లను కొల్లగొట్టేందుకు కొంతమంది ప్రలోభాలకు గురిచేస్తున్నారని, అలాంటి మాటలను నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు. సభలో బీఎస్పీ జాతీయ, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.