కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప కార్పొరేషన్ ఎన్నికల రోజు ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటుహక్కును పోలింగ్ కేంద్రానికి వెళ్లి సద్వినియోగం చేసుకోవాలని, లేనిపక్షంలో ఇంట్లో ఉండాలని బహిరంగ ప్రదేశాలలో గుంపుగుంపులుగా ఉంటే చర్యలు తప్పవని కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఓటర్లను ఎవరైనా అభ్యర్థులు వాహనాలలో తరలిస్తే చర్యలు తప్పవన్నారు. కడప చిన్నచౌకు పరిధిలోని మానస కల్యాణ మండపంలో 4, 5, 6, 7 డివిజన్ల అభ్యర్థులు, ప్రజలకు ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళిపై గ్రామసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఆ సమయంలో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఓటింగ్ సమయంలో పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు మేరకు ఏవైనా ఇళ్లు ఉంటే ఆ ఇంటికి సంబంధించిన కుటుంబ సభ్యులే ఉండాలిగానీ, పరాయి వాళ్లు ఉండకూడదని పేర్కొన్నారు. ఎన్నికల రోజున అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులుగానీ, మద్యంగానీ, అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేస్తే వారిపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. అర్బన్ సీఐ బి.శ్రీనివాసులు, వన్‌టౌన్ సీఐ ఎస్.మహబూబ్‌బాష, చిన్నచౌకు సీఐ యుగంధర్‌బాబు, ఎస్‌ఐ హేమకుమార్, పోలీసు సిబ్బంది, స్థానికులు, అభ్యర్థులు పాల్గొన్నారు.