సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలకు అభ్యర్థులు పాల్పడరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. శుక్రవారం సాయంత్రం ఐదింటి నుంచి ప్రచారంపై ఆంక్షలు అమలులోకి వచ్చాయని ఈసీ పేర్కొంది. అభ్యర్థుల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ప్రచారం నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు ఇకపై పోలింగ్ జరిగే పట్టణాల్లో, నగరాల్లో ఉండడానికి వీల్లేదని ఎన్నికల సంఘం హెచ్చరించింది. అన్ని కల్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జిలు అనుమానిత ప్రాంతాలలో సోదాలు చేసి, అలాంటి వారు ఉంటే బయటకు పంపించేయాలని స్పష్టం చేసింది. ఈనెల 30వ తేదీ (ఆదివారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తున్నందున శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రచారంపై నిషేధం విధిస్తున్నట్టు ఈసీ కార్యదర్శి వివరించారు. ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ప్రచారం చేయడానికి వీల్లేదని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు బహిరంగ సభలు, ర్యాలీలు, సంగీత విభావరిలు వంటివి నిర్వహించరాదన్నారు.
్హ రాష్ట్ర వ్యాప్తంగా 146 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు, 10 కార్పొరేషన్లకు సంబంధించి ఈ అంక్షలు అమలులో ఉంటాయి. ్హ మద్యం దుకాణాలు కూడా బంద్ చేయాలి. ్హ ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేసినా పోలింగ్ ముగిసే వరకు టీవీల్లో దానిని ప్రసారం చేయడానికి వీల్లేదు. ్హ పోటీ చేసే అభ్యర్థులు కార్యకర్తలతో సమూహంగా ప్రచారానికి వె ళ్లడానికి కూడా వీల్లేదు. ్హ మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది.
ఆ ఖర్చును వారిపై వేయండి: శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ మున్సిపల్, పరిషత్ ఎన్నికలను కూడా ప్రచారం చేస్తుండడంతో ఈ ఖర్చును ఆయా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఖాతాలో నమోదు చేయాలని ఈసీ తెలిపింది. జిల్లా కలెక్టర్ల సందేహాలకు ఈసీ ఈమేరకు వివరణ ఇచ్చింది. నాయకుల ప్రసంగాల్లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రస్తావించినా, వారికి ఓటు వేయాలని కోరినా ఆ అభ్యర్థుల ఎన్నికల వ్యయం కింద జమచేయాలని ఈసీ కార్యదర్శి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఎన్నికల ప్రచారం గడువు ముగియడంతో అభ్యర్థులు ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తూ ఓట్లు అభ్యర్థించనున్నారు. మద్యం, డబ్బు, ఆభరణాల వంటివి సిద్ధం చేసుకున్నారు. మద్యం దుకాణాలు మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నప్పటికీ.. పట్టణాల్లో మద్యం సులభంగా లభిస్తున్నట్టు తెలిసింది.