భద్రత కట్టుదిట్టం | municipal elections challenge police department | Sakshi
Sakshi News home page

భద్రత కట్టుదిట్టం

Published Sat, Mar 29 2014 2:49 AM | Last Updated on Mon, Aug 20 2018 3:37 PM

municipal elections  challenge police department

కర్నూలు, న్యూస్‌లైన్: పురపాలక ఎన్నికలను పోలీసు శాఖ సవాల్‌గా తీసుకుంది. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఎస్పీ రఘురామిరెడ్డి ఆదేశాల మేరకు సబ్ డివిజన్ స్థాయి అధికారులు, స్థానిక పోలీసు అధికారులతో భద్రతపై సమీక్ష నిర్వహించారు. అందుబాటులోని సిబ్బందితో పాటు పారా మిలటరీ బలగాలతో నిఘాను తీవ్రతరం చేశారు. ఇప్పటికే పారా మిలటరీ బలగాలన్నీ మున్సిపల్ పట్టణాలకు చేరుకోగా.. సీఆర్‌పీఎఫ్, ఏపీఎస్పీ సిబ్బంది సేవలను ఎన్నికల బందోబస్తుకు వినియోగిస్తున్నారు.


జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ, 8 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 79 మంది ఎస్‌ఐలు, 294 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 1074 మంది కానిస్టేబుళ్లు, 64 మంది హోంగార్డులు, ఏఆర్‌ఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు 470 మంది, 1421 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు, 17 ప్లటూన్ల ఏపీఎస్పీ, సీఎపిఎఫ్ సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. స్పెషల్ స్ట్రయికింగ్, స్ట్రయికింగ్ ఫోర్సులతో పాటు షాడో పార్టీలను ఇప్పటికే రంగంలోకి దింపారు. ఎన్నికలు జరిగే మునిసిపల్ పట్టణాల్లోకి కొత్త వ్యక్తులు, ఎన్నికలతో సంబంధం లేని వారు రాకుండా చెక్‌పోస్టుల వద్ద కట్టడి చేశారు. అక్రమ మద్యం సరఫరాకు అడ్డుకట్ట వేయడంతో పాటు బెల్టు షాపులపై దాడులు కొనాసాగించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 1183 మంది లెసైన్స్ ఆయుధాలు ఉండగా, ఇప్పటి వరకు 1104 ఆయుధాలను జిల్లా ఆర్మ్‌డ్ హెడ్‌క్వార్టర్‌తో పాటు ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయించారు.

 ప్రధాన రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఎన్నికల్లో గొడవలకు ఆస్కారం కలిగిస్తారనే అనుమానం ఉన్న వారందరిపైనా షాడో పార్టీలు ఏర్పాటయ్యాయి. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు అవకాశం లేకుండా వీడియో చిత్రీకరించేందుకు ఈ సారి ప్రత్యేక చర్యలు చేపట్టారు. 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 సీఆర్‌పీసీ అమలులో ఉన్నందున కర్నూలు నగరంతో పాటు జిల్లా మొత్తం మీద సభలు, సమావేశాలు విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించారు. ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు అలాంటి వారిని జిల్లా బహిష్కరణకు గురి చేసేలా ఎస్పీ ఆదేశించారు. జిల్లాలోని 8 మునిసిపాలిటీల్లో ఈనెల 30న పోలింగ్ జరగనుంది. పోలింగ్ రోజు శాంతియుత ప్రజా జీవనానికి అవరోధం కలిగించేలా హింసాత్మక ఘటనలకు పాల్పడితే అల్లరి మూకలపై కాల్పులు జరిపేందుకూ వెనుకాడవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.

 ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోండి: ఎస్పీ

 మునిసిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా నిర్భయంగా వినియోగించుకోవాలని ఎస్పీ రఘురామిరెడ్డి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో మునిసిపల్ ఎన్నికలు జరిగేలా రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కాల్పులకూ  వెనుకాడబోమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement