సాక్షిప్రతినిధి, నల్లగొండ: ప్రాదేశిక సమరం ముగిసింది. మున్సిపల్ ఫలితాల్లో చూపించిన హవానే, ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కొనసాగించింది. అనూహ్యంగా జిల్లా పరిషత్‌ను భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. 59 జెడ్పీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఏకంగా 43 చోట్ల విజయభేరి మోగించింది. 13 జెడ్పీటీసీలను గెలుచుకున్న టీఆర్‌ఎస్ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. గత జెడ్పీ పాలకమండలిలో ప్రాతినిధ్యం వహించిన సీపీఎం ఈ సారి జెడ్పీలో అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయింది.
మరో వామపక్ష పార్టీ సీపీఐ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఒక స్థానం గెలుచుకుని జెడ్పీలో ప్రాతినిధ్యాన్ని నిలబెట్టుకుంది. ముగ్గురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ తర్వాతి బలమైన పార్టీగా ఉన్న టీడీపీ కేవలం రెండు జెడ్పీటీసీలను గెలుచుకుని సంతృప్తి పడాల్సి వచ్చింది. మొత్తంగా జిల్లా పరిషత్ ఫలితాల్లో కాంగ్రెస్ సంచలన మెజారిటీ సాధించింది. ఎంపీటీసీ స్థానాల విషయంలో వెనుకబడిన టీఆర్‌ఎస్ మాత్రం జెడ్పీటీసీ స్థానాల విషయంలో రెండంకెల సంఖ్యను చేరుకుంది.
ఎస్టీలకు రిజర్వు అయిన జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందన్న అంశంపైనే చర్చ జరుగుతోంది. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్ జెడ్పీ చైర్మన్ పదవి రేసులో ఉన్నా, ఆ పార్టీ నాయకత్వం అధికారికంగా ఎక్కడా ఆయన పేరును ప్రకటించలేదు. దీంతో ఇతరుల నుంచి ఏమైనా పోటీ ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మండల పరిషత్ విషయంలో కూడా కాంగ్రెస్ తన పట్టు నిరూపించుకుంది. ఆ పార్టీ ఏకంగా 25 మండల పరిషత్‌లను గెలుచుకునేందుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ సాధించింది. పోటీ ఇస్తుందనుకున్న టీఆర్‌ఎస్ 3 స్థానాలకు పరిమితం కాగా, టీడీపీ కేవలం 2 చోట్లనే మండలాలను కైవసం చేసుకునేంత మెజారిటీ పొందింది. ఈ ఎన్నికల్లో ఓటర్లు చతురత చూపారు. జెడ్పీటీసీ స్థానాల విషయంలో 43 చోట్ల కాంగ్రెస్‌కు ఆధిక్యం ఇచ్చిన ఓటర్లు మండలాల విషయం వచ్చే సరికి 25 మండలాలకే పరిమితం చేశారు. ఏకంగా 28 మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని కారణంగా హంగ్ ఏర్పడింది.
నకిరేకల్ నియోజకవర్గంలో నార్కెట్‌పల్లి మండలాన్ని మినహాయిస్తే మిగిలిన ఐదు మండలాల్లో హంగ్ ఏర్పడడం విశేషం.
సూర్యాపేట నియోజకవర్గంలోనూ నాలుగు మండలాలకు రెండు చోట్ల ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు.
మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, నాంపల్లి మండలాల్లో జెడ్పీటీసీలను టీఆర్‌ఎస్ గెలుచుకోగా, ఈ మూడు మండలాలతో పాటు నాంపల్లి మండలాల్లో ఎంపీపీలకు సంబంధించి హంగ్ ఏర్పడింది.
తుంగతుర్తి నియోజకవర్గంలో మరీ విచిత్రమైన ఫలితాలు వచ్చాయి. ఇక్కడ తిరుమలగిరి మండలంలో స్వతంత్రులే ఎక్కువ స్థానాల్లో గెలిచి మండల పరిషత్‌ను సొంతం చేసుకునేంత మెజారిటీ సాధించా రు. మిగిలిన తుంగతుర్తి, మోత్కూ రు, శాలిగౌరారం, అర్వపల్లి, నూతన్‌కల్ మండలాల్లో ఒక్క చోట కూడా ఏ పార్టీకి స్పష్టమైన మెజారి టీ రాక హంగ్ ఏర్పడింది. మొత్తం గా, జిల్లాలో 28 మండలాల్లో ఇదే రకమైన తీర్పు రావడం విశేషం.
అంతటా.. హస్తవాసే
Published Thu, May 15 2014 3:13 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement