జమిలి ఎన్నికల చర్చ
దాదాపు ఏణ్ణర్ధం నుంచి అప్పుడప్పుడు వినిపిస్తున్న జమిలి ఎన్నికల ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్ని కలపై ప్రారంభమైన నిర్మాణాత్మక చర్చను కొనసాగించాలని ముఖ్యమంత్రులను కోరారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణ మనకు కొత్తేమీ కాదు. దేశంలో 1967 వరకూ ఆ పద్ధతే అమల్లో ఉంది. అంటే 1952, 1957, 1962, 1967ల్లో లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి.
అంతవరకూ ఏ ఎన్నిక జరిగినా తిరుగులేని విజయం సాధిస్తూ వచ్చిన కాంగ్రెస్ తొలిసారి 1967 లోక్‌సభ ఎన్నికల్లో బలహీనపడటంతోపాటు కొన్ని రాష్ట్రాల్లో బాగా దెబ్బతింది. అలాంటి చోట చిన్న పార్టీలు విజయం సాధించి కూటములుగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాలు నెలకొల్పాయి. ఆ ప్రభుత్వాలు ఎన్నాళ్లో మనుగడ సాధించలేకపోయాయి. మరో పక్క ఇందిరాగాంధీ 1971లో లోక్‌సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు సిద్ధపడ్డారు. ఫలితంగా జమిలి ఎన్నికల సంప్రదాయానికి గండిపడింది. అప్పటినుంచీ దేశంలో ఇంచుమించు ఏడాదికో, రెండేళ్లకో ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. జమిలి ఎన్నికలు పోయి ఇలా వేరు ఎన్నికలు రావడంలో నిజంగా సమస్య లున్నాయా? ఉంటే ఎవరికున్నట్టు?
వాజపేయి నేతృత్వంలో 1999లో ఎన్‌డీఏ ప్రభుత్వం ఉండగా లా కమిషన్ సమ ర్పించిన 170వ నివేదిక ఎన్నికల సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిం చింది. అందులో జమిలి ఎన్నికల అవసరాన్ని చర్చించింది. 2012లో బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఈ అంశంపై లేఖ రాశారు. నిరుడు సెప్టెంబర్‌లో ప్రణబ్ ముఖర్జీయే ఏకకాలంలో ఎన్నికలపై అన్ని పార్టీలూ ఏకాభిప్రా యానికి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం సరేసరి. అది సందర్భం వచ్చిన ప్పుడల్లా ఈ ప్రతిపాదన గురించి చెబుతూనే వస్తోంది.
పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా జమిలి ఎన్నికలకే ఓటేసింది. చాలా పార్టీలు కూడా ఈ ప్రతిపాదన సహేతుకమై నదని అంటున్నాయి. కాకపోతే ఆచరణ సాధ్యంకాదని పెదవి విరుస్తున్నాయి. ఎందుకంటే అందుకోసం కొన్ని అసెంబ్లీల గడువు కాలాన్ని పెంచాల్సి ఉంటుంది. మరికొన్నిటికి కోత వేయాల్సివస్తుంది. ఇలా ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతున్నారు... కోరుకుంటున్నారు గనుక అది మంచిదే కావొచ్చునని భావించనవసరం లేదు. నిజమే–జమిలి విధానం వల్ల ఎన్నికల వ్యయం గణనీయంగా తగ్గిపోతుంది. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమయ్యే మన దేశంలో ఈ ఇది చెప్పుకోదగ్గ ఆదాయే. కొంత మేర నల్ల డబ్బు ప్రభావమూ తగ్గొచ్చు. దీన్ని సమర్ధించేవారు చెబుతున్న బలమైన కారణం మరొకటుంది. అది ప్రభుత్వ విధానాలకు సంబంధించింది. తరచు ఎన్నిక లుండటం వల్ల ప్రభుత్వ విధానాలకూ, కార్యక్రమాలకూ గండిపడుతున్నదని జమిలి ఎన్నికల సమర్ధకులు చెప్పే మాట.
ఏ ఏ సందర్భాల్లో గండి పడిందో ఇలాంటివారు నిర్దిష్టమైన ఉదాహరణలిస్తే అందులోని లాభనష్టాలపై చర్చించవచ్చు. చిల్లర వర్త కంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతించడానికి సంబంధించిన బిల్లుపై 2012లో దేశవ్యాప్తంగా నిరసనలొచ్చినా, రాజ్యసభలో అప్పట్లో యూపీఏ ప్రభుత్వం మైనారిటీలో ఉన్నా ఆ బిల్లు సునాయాసంగా నెగ్గింది. ఆ బిల్లును వ్యతి రేకిస్తున్నానని చెప్పిన టీడీపీ ఆఖరి నిమిషంలో తన ఎంపీలను సభకు గైర్హాజరయ్యేలా చేసి కాంగ్రెస్‌కు తోడ్పడింది. బీఎస్‌పీ, ఎస్‌పీలు సైతం ఆ పనే చేశాయి. కనుక ప్రభు త్వాలకు జీవన్మరణ సమస్యగా మారిన కీలక సంస్కరణలేవీ ఎన్నికల కారణంగా ఎప్పుడూ ఆగలేదు.
ఎన్నో వైవిధ్యతలున్న దేశంలో జమిలి ఎన్నికలతో ఏకరూపత సాధించాలను కోవడంలోని తర్కమేమిటో బోధపడదు. వేర్వేరు ఎన్నికలుండటంవల్ల ప్రజా స్వామ్యం, ఫెడరలిజంలు పరిఢవిల్లుతాయి... పరిపుష్టమవుతాయే తప్ప బలహీనప డవు. రాష్ట్రాల ఎన్నికల్లో ప్రాంతీయ ఆకాంక్షలు, సమస్యలు ఎజెండాలోకి వస్తాయి. అభివృద్ధికి సంబంధించి వేర్వేరు రాష్ట్రాల ప్రజలు వేర్వేరు మార్గాలు ఎంచుకుంటారు. ఒక రాష్ట్రంలో ఎంతో ప్రజాదరణ పొందిన పార్టీ మరోచోట ఎవరికీ తెలియక పోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 వంటివి ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవు. మరోపక్క విపక్షాల ఏలుబడిలోని చాలా రాష్ట్రాలు ఆ పథకాలను అమలు చేసి అనంతర కాలంలో ప్రజాదరణ పొందాయి. జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ ఆకాంక్షలు, సమస్యలు మరుగునపడతాయి. సృజనాత్మకత, ప్రజా సంక్షేమ పథకాల అమలులో పోటీ తగ్గుతాయి. జాతీయ అంశాలే ప్రధానమవుతాయి. ఇది ఫెడరలిజం స్ఫూర్తికి హాని కలిగిస్తుంది.
1999 మొదలుకొని జరిగిన జమిలి ఎన్నికల ఫలితాలకు సంబంధించిన డేటాను గమనిస్తే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీకి ఓటేసే అవకాశాలు 77 శాతం ఉంటాయని తేలిందని ఒక పరిశోధన తేల్చిచెప్పింది. ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలన్న విధానం అటు పౌరులకు, ఇటు ప్రభు త్వాలకు కూడా గుదిబండగా మారుతుంది. ఒక అంశంపై అధికార పక్షం స్వేచ్ఛగా ప్రజల తీర్పు కోరడానికి సిద్ధపడటం అసాధ్యమవుతుంది. అటు ప్రజలు సైతం అలా డిమాండ్ చేసే హక్కు కోల్పోతారు. నిజానికి అభివృద్ధి చెందిన అమెరికా, జర్మనీ తది తర దేశాల్లో కూడా జమిలి ఎన్నికల విధానం అమల్లో లేదు. పైగా అధికార పక్షం మైనా రిటీలో పడితే ఏం చేయాలో జమిలి ఎన్నికలు కోరేవారు చెప్పడంలేదు.
ప్రస్తుత ఎన్నికల విధానంలో సమస్యలున్న మాట వాస్తవం. ముఖ్యంగా ఎన్ని కల వ్యయం, నల్ల డబ్బు చలామణి అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటి కట్టడికి ఏం చేయాలో, ఎన్నికలు జరిగే తీరును ప్రక్షాళన చేసేందుకు ఇంకేమి చర్యలు అవసరమో ఎన్నికల సంఘం చర్చించాలి. పార్టీలకు ఎన్నికల నిధుల్ని ప్రభుత్వం సమకూర్చడంతో సహా అనేక ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి. పార్టీలన్నీ చిత్త శుద్ధితో వ్యవహరిస్తే ఈ అంశాల్లో ఏకాభిప్రాయం కష్టం కాదు. ప్రభుత్వాలు ప్రజాకంటకంగా మారిన ప్పుడు పౌరులకు ‘రీకాల్’ చేసే హక్కుండాలని వాదనలు వినిపిస్తున్నవేళ... అందుకు అసలే అవకాశమీయని జమిలి ఎన్నికలు ప్రధాన చర్చగా మారడం వింత కలిగిస్తుంది.