దుష్ట సంహారం | mydukur in speach ys vijayamma | Sakshi
Sakshi News home page

దుష్ట సంహారం

Published Fri, Mar 28 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM

మైదుకూరులో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ

మైదుకూరులో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ

 సాక్షి ప్రతినిధి, కడప: వచ్చే ఎన్నికల్లో దుష్టసంహారం చేయాలని వైఎస్ విజయమ్మ కోరారు. వైఎస్ ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారు.. మరెందరికో ఆర్థికంగా చేయూతనందించారు., వారంతా అండగా లేరు.. మాకు తోడూ నీడ గా మీరున్నారు.. మీప్రేమకు, ఆప్యాయతకు కృతజ్ఞతలు. మీరిచ్చిన స్ఫూర్తితోనే ఎన్ని కష్టాలొచ్చినా ఎదురొడ్డి నిలిచాం.. 30 ఏళ్లుగా రాజశేఖరరెడ్డిని  భుజాలకెత్తుకొని మోశారు.. ఆదే ఆదరణ, ఆప్యాయతలు మాపై చూపుతున్నారు... మీరుణం తీర్చుకోలేనిదన్నారు.. ఎన్నికల ప్రచారం జనభేరిలో భాగంగా రెండవ రోజు కడప కార్పొరేషన్, మైదుకూరు, బద్వేలు, సిద్దవటంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ నుంచి తాము బయటికి వచ్చాక జరిగిన  అనేక ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చారన్నారు. కడప పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో 5,45,672 ఓట్ల మెజార్టీతో జగన్‌బాబును గెలిపించారన్నారు.
 

ఈ విషయంలో దేశచరిత్రలోనే జగన్ మూడో స్థానంలో నిలిచారన్నారు. దీనికి  మీ ఆప్యాయతలే కారణమన్నారు. వైఎస్‌లాగే తమను కూడా మీ కడుపులో దాచుకున్నారని, మీ రుణం మరువలేనిదని విజయమ్మ పేర్కొన్నారు.మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.  కాంగ్రెస్,  తెలుగుదేశం పార్టీల కుయుక్తులకు చరమగీతం పాడాలన్నారు.  వైఎస్సార్‌జిల్లాలో  మీ ప్రేమ, ఆప్యాయతల కారణంగా వైఎస్ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉందని, ఈ ఎన్నికల్లో మరోమారు  ఆదరించాలని కోరారు.

 విజయమ్మ జనభేరి సక్సెస్
 కడప కార్పొరేషన్, మైదుకూరు, బద్వేలు మున్సిపాలిటీలలో గురువారం వైఎస్ విజయమ్మ నిర్వహించిన జనభేరి కార్యక్రమం సక్సెస్ అయింది. దివంగత నేత సతీమణి వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారాన్ని వస్తుందని తెలుసుకున్న ప్రజానీకం రోడ్లపై నిరీక్షించారు. మండుటెండలో సూర్యుడు చిన్నబుచ్చుకునేలా కడప పురవీధుల్లో భారీ ఎత్తున ఘనస్వాగతం పలికారు. బిల్డప్ నుంచి కృష్ణాసర్కిల్ వరకు పెద్దాయన సతీమణి కోసం బారులు తీరారు. ఓపికగా గంటల తరబడి నిరీక్షించారు.

 విజయమ్మ  అనర్గళంగా  ప్రసంగం చేయడం చేసి ప్రజానీకం ఆశ్చర్యానికి లోనయ్యారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను వివరిస్తున్న ఒక దశలో  ‘తల్లీ మీరు ఎండలో తిరగొద్దు. మీ కుటుంబానికి తోడునీడగా మేం ఉన్నాం.. ఈ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకుంటాం’ అని కృష్ణాసర్కిల్‌లో  ఉబికివస్తున్న దుఃఖంతో కొందరు విజయమ్మకు వివరించారు.  విజయమ్మ రాకతో  మైదుకూరు నాలుగురోడ్ల కూడలి జనసంద్రంగా మారింది.  మూడు గంటలపాటు నిరీక్షించి మైదుకూరు ప్రజలు విజయమ్మను చూడగానే ఒక్కమారుగా జయజయధ్వానాలు పలుకుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బద్వేలు నాలుగు రోడ్ల కూడలిలో రాత్రి అయినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆమె కోసం వేచి చూశారు.

భారీగా మహిళలు కూడా తరలివచ్చి  వేచి ఉండటం విశేషం.  రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన పథకాలు, చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక పాలన, రాజశేఖర్‌రెడ్డి మృతి చెందిన అనంతరం కొనసాగిన కాంగ్రెస్ పాలనపై సవివరంగా విజయమ్మ ప్రసంగం చేయడం  ప్రజానీకాన్ని ఆకట్టుకుంది. ఆమె మాట్లాడుతున్న సేపు హర్షం వ్యక్తం చేస్తూ ఈలలు, కేకలు వేశారు. పర్యటనలో  కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, జిలా కన్వీనర్, మేయర్ అభ్యర్థి కె.సురేష్‌బాబు, కమలాపురం, కడప, మైదుకూరు, బద్వేలు అభ్యర్థులు వరుసగా పి.రవీంద్రనాథరెడ్డి, ఎస్‌బీ అంజాద్‌బాష, ఎస్ రఘురామిరెడ్డి, టీ జయరాములు, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement