
ఎన్డీఏ సభలు.. తోలు బొమ్మలాటలు
హైదరాబాద్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంవీ మైసూరా రెడ్డి విరుచుకుపడ్డారు. ఎన్డీఏ నిర్వహించిన విజయశంఖారావం సభలు తోలు బొమ్మలాటల్ని గుర్తుకు తెస్తున్నాయని విమర్శించారు. టీడీపీ చేసిన కుమ్మక్కు రాజకీయాల వల్లే రాష్ట్ర విభజన జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన నిర్వాకం వల్లే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుందని, శ్రీకృష్ణ కమిటీ నివేదిక 194వ పేజీలో పేర్కొందని మైసూరారెడ్డి గుర్తు చేశారు.
పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన నామరూపాల్లేని పార్టీ అని, పరిటాల రవి గుండు కొట్టించినప్పుడు పవన్ పౌరుషం ఏమైందని మైసూరా రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యర్థి పార్టీలపై అవాకులు, చవాకులు పేలడం తప్ప ఏ రోజైనా ప్రజాసమస్యలపై పవన్ పోరాడాడా అని నిలదీశారు. ప్రజలకు ఏం చేశాడని పవన్ జనాన్ని ఓట్లడుగుతున్నాడని మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలు సినిమా డైలాగులుగా పనికొస్తాయి కానీ ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి లేదని మైసూరారెడ్డి విమర్శించారు.