
వారణాసిలో మోడీ పోస్టర్లకు తారు
'నరేంద్ర మోడీ గో బ్యాక్ టు గుజరాత్'! వారణాసిలో ఇప్పుడు బిజెపియేతర పక్షాలన్నీ ఈ నినాదాన్ని జపిస్తున్నాయి. ఒక వైపు బిజెపి కార్యకర్తల్లో భారీ ఉత్సాహం పెల్లుబుకుతూంటే, మరో వైపు ఆయన విరోధులు కూడా పూర్తి జోరుమీదున్నారు. ఆదివారం వారణాసిలో పలు చోట్ల మోడీ పోస్టర్లపై సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు తారు పూశారు. మోడీ గో బ్యాక్ అంటూ గోడలపై రాతలు రాశారు.
ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత అరవింద్ కేజరీవాల్ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ కూడా గట్టి అభ్యర్థినే బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు బిజెపయేతర పార్టీలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న ఆలోచనలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. మోడీ వారణాసి నుంచి పోటీ చేయడంతో తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బీహార్ లో బిజెపికి చాలా అనుకూల వాతావరణం ఏర్పడిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ తారు పూయడం, గోబ్యాక్ అనడం తమకే లాభిస్తాయని బిజెపి భావిస్తోంది.