భజన సభ
సాక్షి ప్రతినిధి, గుంటూరు :సీమాంధ్ర సింహగర్జన సభ కాస్తా పిల్లపార్టీ పొగడ్తల సభగా మారింది. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న నరేంద్రమోడీ, సీమాంధ్రకు కాబోయే సీఎంను నేనేనని ఊరికే గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు రాజకీయాల్లో ఇంకా ఓనమాలు దిద్దని పవన్‌ను ఆకాశానికి ఎత్తేయడమే పనిగా పెట్టుకున్నాయి. ఆ పార్టీకి నిండా రెండు నెలల వయసు లేదు. గ్రామ స్థాయిలో కార్యకర్తలు లేరు. కమిటీలు అసలే లేవు. కానీ మూడు దశాబ్దాల చరిత్రగల పార్టీలను నడిపిస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీతో జత కట్టిన బీజేపీ అగ్రనేతలు కొత్తగా ఏర్పడిన పిల్ల పార్టీ అధినేతను ఇంద్రుడు.. చంద్రుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
34 సంవత్సరాల వయసు కలిగిన భారతీయ జనతా పార్టీ (జాతీయ పార్టీ) 30 సంవత్సరాల వయసు కలిగిన తెలుగుదేశం రాజకీయాల్లో ఇంకా ఓనమాలు నేర్వని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌పై ఆధారపడ్డాయి. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ సహకారంతో లభించనున్న ఓట్లు తమ గెలుపునకు కీలకం కానున్నాయని భావిస్తున్నాయి. గురువారం గుంటూరులో జరిగిన సీమాంధ్ర సింహగర్జన సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగాలు రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచాయి. ఆయా పార్టీల ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులు కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్టుగా పపర్ స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.
టీడీపీ, బీజేపీలకూ పవనే స్ఫూర్తట.: ‘తెలుగు ప్రజల పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న ప్రేమ, అభిమానం నా హృదయాన్ని తాకింది. రాష్ట్ర విభజన సమయంలో అతను ఎంత మధన పడింది నాకు తెలుసు. అధికారం కోసం అతనేమీ ఆరాటపడటం లేదు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు ఎన్నికల్లో పనిచేయాలని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. చంద్రబాబు మరో అడుగు ముందుకేసి, పవన్ కళ్యాణ్‌కు ఏ స్వార్థం లేదు. ఇక్కడికి రావడం వల్ల రూపాయి ఆదాయం లేదు. నిస్వార్థంగా ఇక్కడకు వచ్చి నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలని, సీమాంధ్రలో టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పారు.
ఇదే సమయాన్ని కాల్‌షీట్స్‌కు ఉపయోగించుకుంటే ఎంతో సంపాదించుకోవచ్చు, అయినా ప్రజల కోసం ప్రచారం చేస్తున్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని పవన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. సభకు 15 వేల మంది వరకు ప్రజలు హాజరైతే ఇందులో 12 వేల వరకు టీడీపీ, బీజేపీ కార్యకర్తలున్నారు. పరిమితంగా ఉన్న మూడు వేల జనసేన కార్యకర్తలకే ఇద్దరు అగ్రనేతలు ప్రాధాన్యత ఇవ్వడం కూడా చర్చనీయాంశం అయింది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, మాజీ మంత్రులు ఇదే తరహాలో జనసేన పార్టీకి అనుకూలంగా ప్రసంగాలు చేశారు. మాజీ మంత్రి శనక్కాయల అరుణ మాట్లాడుతూ తన చిట్టి తమ్మునిగా పవన్‌ను అభివర్ణించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అయితే ఏకంగా పవన్ టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు పార్లమెంట్, అసెంబ్లీలకు దారి చూపుతాడని, అతని అభిమానులు, కార్యకర్తల సహకారం తమకు ఉంటుందని పేర్కొన్నారు.
విఫలమైన జన సమీకరణ.: సభకు సుమారు 3.50 లక్షల మందిని సేకరించాలని పార్టీ నేతలు భావించారు. అయితే 15 వేలకు మించి పార్టీ అభిమానులు,కార్యకర్తలు హాజరుకాలేదు. దీనికి తోడు పవన్‌కళ్యాన్ మిగిలిన ప్రాంతాల్లోని సభల కంటే తక్కువ సమయంలోనే ప్రసంగాన్ని ముగించారు. దీనితో జనసేన కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. గుంటూరు పార్లమెంటు అభ్యర్థి గల్లా జయదేవ్ ప్రసంగం పేలవంగా సాగింది. వచ్చీరానీ తెలుగులో ప్రసంగం చేయడంతోపాటు బీజేపీ గుర్తు కమలం అని తెలుగులో ఉచ్చరించకుండా లోటస్ అని ఆంగ్లంలో పేర్కొన్నారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాయపాటి సాంబశివరావు సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరకుండా హస్తం గుర్తుపై ఓటు వేయాలని పొరపాటున ప్రజలను కోరారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారిని వేదికపై ఆహ్వానించకపోవడంతో అవమానంగా భావించి కన్నీరు పెట్టారు. వేదికపై ఉన్న నేతలు ఆమెను ఆహ్వానించినప్పటికీ ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలు అత్యుత్సాహంతో బారికేడ్లను తోసుకుని ముందుకు వచ్చి సభలో గందరగోళం సృష్టించారు.